Share News

ఏమయ్యారో...?

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:06 AM

జిల్లాలో రౌడీ షీటర్లు, కిరాయి హంతకులపై నిఘా కరువైంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లకు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.

ఏమయ్యారో...?

రౌడీ షీటర్ల కదలికలపై నిఘా కరువు

తూతూ మంత్రంగా కౌన్సెలింగ్‌

జిల్లాలో కిరాయి హంతకులు 44, రౌడీషీటర్లు 1,290

వీరి కదలికలపై నిఘా ఉందా?

కర్నూలు క్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రౌడీ షీటర్లు, కిరాయి హంతకులపై నిఘా కరువైంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లకు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. వారి కదలికలపై తరుచూ నిఘా ఉంచాలి. రెండు వారాలకోసారైనా వారి ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేయాలి. రౌడీషీటర్ల సమాచారం కోసం ఇన్‌ఫార్మర్లను నియమించుకుని వివరాలు రాబట్టాలి. ఇదీ పోలీసు శాఖ పని. కానీ జిల్లాలో నాలుగేళ్ల నుంచి రౌడీషీటర్ల కదలికలపై నిఘా కరువైంది. పోలీసుల భయం లేకపోవడంతో వారి అరాచకాలకు అడ్డూ లేకుండా పోయింది. సాధారణ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. స్టేషన్‌ పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపులే కుండాపోతోంది. ఇటీవల రౌడీషీటర్లు, కిరాయి హంతకులు అసలు ఎక్కడున్నారో కూడా పోలీసు శాఖ గుర్తించలేకుండా పోయింది. శరీన్‌నగర్‌లో టీడీపీ నాయకుడు సంజన్న హత్య కేసు ఘటనతో పోలీసులు కొంత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయితే మట్కా కేసులు, పేకాట కేసుల్లో రౌడీషీట్లు ఓపెన్‌ చేసిన వారికి మాత్రమే కొందరినీ పిలుస్తూ తూతూ మంత్రంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. కొంత మంది పోలీసు అధికారులకు నెల నెలా మామూళ్లు ముట్టచెప్పుతుండటంతో కొంత మంది కౌన్సిలింగ్‌కు రౌడీషీటర్లు స్టేషన్లకే రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజన్న హత్య కేసులో ప్రధాన ముద్దాయి అంజిని గతంలో స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో నిందితుడు అంజిని అడ్డుగా పెట్టుకుని గతంలో పని చేసిన ఒకరిద్దరు పోలీసు అధికారులు భారీ ఎత్తున అక్రమాదాయానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కిరాయి హంతకులు 44 మంది

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాలుగు పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో 38 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒక కిరాయి హంతకుడు ఇస్వీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నాడు. ఇతనిపై ఏడు పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలో 20 మంది కిరాయి హంతకులు ఉండగా.. నాగులాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, కోడుమూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో, కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరు, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏకంగా ఏడుగురు ఉన్నారు. వీరిలో ఓ ఇద్దరు కిరాయి హంతకులపై పదికి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తాలుకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నలుగురు, ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక కిరాయి హంతకుడు ఉన్నారు. పత్తికొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో, ఆస్పరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, దేవనకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నలుగురు, జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు, క్రిష్ణగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు, మద్దికెర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు, పత్తికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరు ఉన్నారు. అలాగే ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో గోనెగండ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు, ఎమ్మిగనూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది కిరాయి హంతకులపై 2 నుంచి 3 కేసులు ఉండగా.. పది మంది కిరాయి హంతకులపై నాలుగుకు పైగా కేసులు, ఏడుగురు కిరాయి హంతకులపై 9 దాకా కేసులు ఉన్నాయి.

సబ్‌ డివిజన్ల

వారీగా రౌడీషీట్లు

ఆదోని 160

కర్నూలు 460

పత్తికొండ 310

ఎమ్మిగనూరు 360

మొత్తం 1,290

అత్యధికంగా కేసులు

ఉన్న స్టేషన్లు

కర్నూలు

ఫోర్త్‌ టౌన్‌ 127

కౌతాళం 103

ఆస్పరి 74

కర్నూలు

తాలుకా 73

కోసిగి 71

ఓర్వకల్లు 62

ఆదోని

వన్‌టౌన్‌ 62

మొత్తం 572

జిల్లా వ్యాప్తంగా 1058 మందిపై మూడు కేసులు, 172 మందిపై నాలుగుపైగా కేసులు, 35 మందిపై ఏడుకు పైగా కేసులు, 27 మందిపై పదికి పైగా కేసులు ఉన్నాయి. పదికి పైగా కేసులు ఉన్న వారిలో హోళగుంద పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరుగురు ఉన్నారు. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలో బెళగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో 23 మంది, కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 48 మంది, కోడుమూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 46 మంది, కర్నూలు టూటౌన్‌ పరిధిలో 36, త్రీటౌన్‌ పరిధిలో 28, ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 15 మంది ఉన్నారు. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలో 389 మంది రౌడీషీటర్లపై మూడు కేసులు దాఖలయ్యాయి. పత్తికొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో 240 మందిపై మూడు కేసుల చొప్పున ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 298, ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో 131 మందిపై మూడు కేసులు దాకా ఉన్నాయి.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

మా పరిధిలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న రౌడీషీటర్లందరికీ కౌన్సెలింగ్‌ ఇస్తున్నాము. వారి కదలికలపై నిఘా పెట్టాం. రౌడీషీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా సమాచారం ఇవ్వాలి. ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం.

-శ్రీధర్‌, సీఐ, కర్నూలు

తాలుకా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాం

ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగులాపురం పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఉండే రౌడీషీటర్లందరికీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాము. ఓర్వకల్లులో ఉండే రౌడీషీటర్‌ శివపై ప్రత్యేక నిఘా ఉంచాము. గ్రామాల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. రౌడీయిజం చేసినా, బెదిరింపులకు దిగినా పీడీ యాక్టు నమోదు చేసేందుకు వెనుకాడం.

- చంద్రబాబు నాయుడు, సీఐ, కర్నూలు రూరల్‌

Updated Date - Mar 28 , 2025 | 12:06 AM