Share News

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:04 AM

రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

  • గత ప్రభుత్వం వ్యవసాయానికి తాళాలు వేసింది

  • రైతుల ఉసురు తీశారు: అచ్చెన్నాయుడు

  • రైతులకు ఏమిచ్చామో చర్చకు సిద్ధం: బొత్స

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద ఏడాదికి 6వేలు ఆర్థిక సాయం చేస్తోందని, మరో 14 వేలు కలిపి రూ.20 వేల చొప్పున రైతులకు అందిస్తామన్నారు. 43 లక్షల మంది రైతులకు కేంద్రం పీఎం కిసాన్‌ సాయం ఇస్తోందని, రాష్ట్రంలో మరో 9నుంచి 10 లక్షల మంది వరకు అర్హులైన రైతులు ఉంటారని వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఇంకా అర్హులైనవారు ఉంటే అందరికీ ఏటా 20 వేలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు పథకం అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు. కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలోని 90శాతం మంది కౌలు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. రైతు భరోసా అందించే విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగించిందని, కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి, మాట తప్పిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరీక్షలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయానికి తాళం వేసిందని మంత్రి విమర్శించారు. ఊరు చివర్లో దిష్టిబొమ్మల్లా రైతు భరోసా కేంద్రాలు కట్టారని, వాటిని రైతు సేవా కేంద్రాలుగా మార్చి సేవలందిస్తున్నామని చెప్పారు. కంపెనీలకు 1,120 కోట్లు బకాయిలు పెడితే తామే చెల్లించామన్నారు.


ఈ సమాధానంపై వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసి, వాకౌట్‌ చేశారు. గత ప్రభుత్వంపై బురద జల్లేలా మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణలు చేస్తున్నారని బొత్స అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. రైతుల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు తాము సిద్ధమన్నారు.

18 వేల కిలోమీటర్ల రోడ్లపై గుంతలు పూడ్చాం: మంత్రి జనార్దనరెడ్డి

గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గుంతలమయం చేసిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి మండిపడ్డారు. గత పాలకులు చేసిన పాపాల వల్ల ప్రస్తుతం రోడ్లకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో 22వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పడితే ఇప్పటివరకు 18 వేల కిలోమీటర్ల గుంతలు పూడ్చామన్నారు. 85శాతం రహదారులను బాగు చేశామన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొడితే తమ ప్రభుత్వం చెల్లించిందని సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


భోగాపురానికి కొత్త రోడ్లు: మంత్రి నారాయణ

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తవుతున్నందున విశాఖపట్నంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు కొత్త రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. విమానాశ్రయం ప్రారంభించడానికి ముందే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, గంటా శ్రీనివాసరావు, పూసపాటి అతిథి, విష్ణుకుమార్‌రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలుతోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని, అవి కార్యరూపం దాల్చేలా విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేసి తగు నిర్ణయాలు తీసుకోవాలని స్పీకరు అయ్యన్నపాత్రుడు మంత్రికి సూచించారు. వచ్చే వారమే సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

చేనేత వస్త్రాలు ధరించాలి: మంత్రి సవిత

ప్రజాప్రతినిధులంతా వారానికొక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సూచించారు. క్లస్టర్‌ డెవలె్‌పమెంట్‌ ప్రోగ్రాం కింద చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని చెప్పారు.

Updated Date - Mar 06 , 2025 | 05:07 AM