Share News

TTD Outsourcing Employees: ఔట్‌ సోర్సింగ్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:52 AM

వైఎస్ జగన్ ప్రభుత్వం "ఆప్కాస్" పేరుతో ఔట్‌సోర్సింగ్ నియామకాలను చేపట్టింది. ఈ నియామకాలు, అవసరమున్న చోట్ల కూడా అధికంగా జరిగాయని, మంత్రి వర్గం ఇప్పుడు వాటిపై విచారణ చేపట్టింది

TTD Outsourcing Employees: ఔట్‌ సోర్సింగ్‌

  • ‘ఆప్కాస్‌’ పేరుతో జగన్‌ మాయలు

  • ఎడాపెడా నియామకాలు

  • టీటీడీలోనే నాలుగు వేల మంది

  • ప్రక్షాళనపై కేబినెట్‌ భేటీలో చర్చ

  • ఆప్కా్‌సపై మంత్రివర్గ ఉపసంఘం

  • విశాఖ ఉక్కుకు రాష్ట్రం చేయూత

  • రూ.2,400 కోట్ల విద్యుత్‌ రాయితీ

  • ఐఏఎస్‌ అధికారులు పల్లెబాట పట్టాలి

  • 3 రోజులు గ్రామాల్లోనే ఉండాలి

  • రుషికొండ భవనాలను సందర్శించండి

  • ఏం చేద్దామో చెప్పండి.. సీఎం సూచన

అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నాడు అధికారంలోకి వచ్చీరాగానే వైఎస్‌ జగన్‌ ‘ఆప్కాస్‌’ పేరుతో విచ్చలవిడిగా ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు చేపట్టారు. వారంతా ఇప్పటికీ కొనసాగుతున్నారు. దీనిపై కూటమి సర్కారు దృష్టి సారించింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల కోసం వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కా్‌సపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వైసీపీ హయాంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అవసరం లేని చోట్ల కూడా అధిక సంఖ్యలో ఉద్యోగులను తీసుకున్నారని మంత్రులు అన్నారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానాల్లో(టీటీడీ)నే సుమారు 4 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈ స్థాయిలో అవసరమా అన్న అంశంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. టీటీడీకి ఆదాయం ఉంది కాబట్టి అంతమంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతోందని.. కానీ ప్రభుత్వ శాఖల్లో అలాంటి పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. దీంతో ఆప్కా్‌సను కొనసాగించాలా.. ప్రక్షాళన చేయాలా.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమర్థ వినియోగంపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. రుషికొండ భవనాలపైనా చర్చ జరిగింది. వాటిని ఏం చేద్దామని మంత్రులను సీఎం ప్రశ్నించారు. వీలైతే ఒకసారి సందర్శించాలని, ప్రత్యక్షంగా చూస్తే వాటినెలా ఉపయోగించుకోవాలో అవగాహన వస్తుందని, ఆ మేరకు సూచనలు తెలియజేయాలని కోరారు.


ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధులతోపాటు ఐఏఎస్‌ అధికారులూ క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు సుమారు 2 వేల మంది ఉంటారని, వీరు క్షేత్రస్థాయిలో తిరిగితే ప్రభుత్వ పనితీరుపై మరింత మెరుగైన సమాచారం తెలుసుకోవచ్చని, గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి ఓ రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రతి అధికారీ ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ మూడు పగళ్లు.. రెండు రాత్రిళ్లు గ్రామస్థులతో గడపాలన్నారు. ఈ కార్యక్రమానికి స్వర్ణ గ్రామం, పల్లె నిద్ర, పల్లె వెలుగు తరహాలో మంచి పేరు నిర్ణయించాలని సూచించారు.

విశాఖ ఉక్కుకు పూర్తి సహకారం..

విశాఖ ఉక్కు కర్మాగారంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. దానిని నిలబెట్టేందుకు అన్ని మార్గాల్లో సాయం అందించాలని, అందులో భాగంగా రూ.2,400 కోట్ల విద్యుత్‌ రాయితీ అందించాలని నిర్ణయించారు. తద్వారా రెండేళ్లు దానికి విద్యుత్‌ చార్జీల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. ప్రస్తుతం నెలకు రూ.100 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లుల భారాన్ని ప్లాంటు భరిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని పోర్టుల ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం అన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా పోర్టుల కోసం మనపైనే ఆధారపడుతోందని చెప్పారు. ఇదే సమయంలో జలరవాణాపై మరింత దృష్టి పెట్టాలని, తద్వారా రవాణా ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:59 AM