Nara Lokesh: విద్య కాషాయీకరణపై ఆధారాలు చూపండి
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:54 AM
కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ(శాఫ్రనైజేషన్) చేశారని వైసీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు చేసిన ఆరోపణపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేకుంటే ఆ పదాన్ని వెనక్కితీసుకోండి: లోకేశ్
పండుల ఆరోపణలపై ఆగ్రహం
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ(శాఫ్రనైజేషన్) చేశారని వైసీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు చేసిన ఆరోపణపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలను ఉపసంహరించుకోవాలని, శాఫ్రనైజేషన్ ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనమండలిలో విద్యా కాషాయీకరణ అంశంపై శాసనమండలిలో దుమారం రేగింది. పాఠశాలల హేతుబద్ధీకరణపై బుధవారం ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. బీజేపీ వారు సిలబ్‌సను కాషాయీకరణ చేసి, కొన్ని పాఠ్యాంశాలను తొలగించి, మరికొన్ని జత చేశారని వైసీపీ సభ్యులు అన్నారు. హిందూ మతం, దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారని ఆరోపించారు.
దీనిపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదువులోకి రాజకీయాలు, మతాన్ని తీసుకురావొద్దని హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వం పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు పదానికి ఇచ్చిన అర్థం ఏమిటో వైసీపీ సభ్యుడు తెలుసుకోవాలని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ డిక్షనరీలో ఇచ్చిన అర్థాన్ని మార్చామని చెప్పారు. విద్యా కాషాయీకరణపై ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నానని లోకేశ్ చెప్పారు. ఈ అంశంపై విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రికార్డులు పరిశీలించి సభ్యుడి వ్యాఖ్యలు తప్పుగా ఉంటే తొలగించాలని కోరారు. రికార్డులు పరిశీలించి తొలగిస్తానని చైర్మన్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.