Share News

Liquor sales: 200 కోట్లు తాగేశారు

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:50 AM

రాష్ట్రంలోని మద్యం ప్రియులు రెచ్చిపోయారు. 31వ తేదీ ఒక్కరోజే దాదాపు రూ.200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 2.5లక్షల కేసుల లిక్కర్‌, 70వేల కేసుల బీరును మందుబాబులు కొనుగోలు చేశారు.

Liquor sales: 200 కోట్లు తాగేశారు

31న భారీగా మద్యం అమ్మకాలు

2.5 లక్షల కేసుల లిక్కర్‌, 70 వేల కేసుల బీరు ఫట్‌

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మద్యం ప్రియులు రెచ్చిపోయారు. 31వ తేదీ ఒక్కరోజే దాదాపు రూ.200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 2.5లక్షల కేసుల లిక్కర్‌, 70వేల కేసుల బీరును మందుబాబులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు రూ.80కోట్ల మద్యం అమ్ముడవుతుంది. దీనికి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఒక్కరోజులోనే మద్యం విక్రయాలు జరిగాయి. న్యూఇయర్‌ ట్రెండ్‌ బుధవారం కూడా కొనసాగింది. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులు, బార్ల లైసెన్సీలు ముందుగానే పెద్దమొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. డిసెంబరు 26 నుంచి మూడు రోజులపాటు రోజుకు రూ.130 కోట్ల మద్యం డిపోల (గోడౌన్లు) నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆదివారం సెలవు మినహాయిస్తే 30న ఏకంగా రూ.219.43 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. 31న రూ.112.42 కోట్ల మద్యం కొన్నారు. ఈ రెండు రోజుల్లోనే లైసెన్సీలు ప్రభుత్వం నుంచి 4.08లక్షల కేసుల లిక్కర్‌, 1.61లక్షల కేసుల బీరు తీసుకున్నారు. ఇందులో 31వ తేదీన 2.5లక్షల కేసుల లిక్కర్‌, 70వేల కేసుల బీరు అమ్మినట్లు అంచనా. పక్క రాష్ర్టాల నుంచి ఎన్‌డీపీఎల్‌, రాష్ట్రంలో నాటుసారాపై నియంత్రణ చర్యలు చేపట్టడం కూడా మద్యం అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. గతంలో మంచి బ్రాండ్లు దొరకడం లేదని, ధర తక్కువకు వస్తుందని తెలంగాణ, కర్ణాటక నుంచి నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఎన్‌డీపీఎల్‌ తీసుకొచ్చేవారు. కొత్త మద్యం పాలసీలో ధరలు తగ్గడం వల్ల ఎన్‌డీపీఎల్‌ ప్రభావం కొంతమేర తగ్గింది. ఎక్సైజ్‌ శాఖ 24గంటల తనిఖీలు చేపట్టడంతో గత రెండు రోజుల్లో ఎన్‌డీపీఎల్‌ ఇంకా తగ్గింది. ఫలితంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయి.

Updated Date - Jan 02 , 2025 | 04:50 AM