Pawan Kalyan Saree Distribution: గిరి మహిళలకు పవన్ ఉగాది కానుక
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:49 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగాది సందర్భంగా తన స్వంత ఖర్చుతో మూడు గిరిజన గ్రామాల్లో 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమం గిరిజన మహిళల్లో ఆనందాన్ని నింపింది

సొంత డబ్బుతో మూడు గ్రామాల్లో చీరల పంపిణీ
అనంతగిరి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఉగాదిని పురస్కరించుకుని తన సొంత డబ్బుతో మూడు గిరిజన గ్రామాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బల్లగరువు, వెలగలపాడు, కొరపర్తి గ్రామాలను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి బాలు.. ఉగాది ముందు రోజు (శనివారం) సందర్శించారు. పవన్ కల్యాణ్ పంపించారంటూ 250 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీంతో గిరిమహిళలు ఎంతగానే సంబరపడ్డారు. పవన్ కల్యాణ్ చల్లగా ఉండాలని దీవించారు. డిసెంబరు 21న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయా గ్రామాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి మహిళలకు ఉగాది పర్వదినం సందర్భంగా చీరలు పంపించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యాసాగర్, పీఆర్ డీఈఈ రామం, అనంతగిరి ఎంపీడీవో ఏవీవీ కుమార్, తహసీల్దార్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.