ఈకేవైసీకి గడువు పెంపు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:35 AM
జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే కబురు. ఏప్రిల్ ఆఖరు వరకు ఈకేవైసీ చేయించుకునేం దుకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్‌ను పటిష్టంగా పంపిణీ చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అందుకు అనుగుణంగా రేషన్‌షాపుల డీలర్ల ద్వారా ఈకేవైసీ కార్యక్రమాన్ని చేపట్టారు.

వచ్చే నెలాఖరు వరకూ అవకాశం
ప్రభుత్వం ఉత్తర్వులు
రేషన్ పంపిణీ సమయంలోనూ చేయించుకోవచ్చు
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే కబురు. ఏప్రిల్ ఆఖరు వరకు ఈకేవైసీ చేయించుకునేం దుకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్‌ను పటిష్టంగా పంపిణీ చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అందుకు అనుగుణంగా రేషన్‌షాపుల డీలర్ల ద్వారా ఈకేవైసీ కార్యక్రమాన్ని చేపట్టారు. సమయం తక్కువగా ఉండటం, ఆధార్ కార్డులు తీసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి రావాలని డీలర్లు చెప్పడంతో కార్డుదారుల్లో గందరగోళం నెలకొంది. ఇదే తంతు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వం స్పందించి ఈకేవైసీ చేయించుకునేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచింది. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో రేషన్ పంపిణీ జరగనున్న నేపథ్యంలో తమ నివాసాల వద్దకు వచ్చే ఎండీయూ (మొబైల్ వాహనాల) ఆపరేటర్ల వద్ద కూడా కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 6.61లక్షల కార్డులు ఉండగా వాటి పరిధిలో 19.38 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారిలో 17.32 లక్షల మందికి ఈకేవైసీ ఉండగా 2.05 లక్షల మందికి లేదు. వారం వ్యవధిలో 27,225 మందికి ఈకేవైసీ చేయగా ఇంకా సుమారు 80వేల మంది వరకూ పెండింగ్‌లో ఉన్నారు. అలాంటి వారంతా వచ్చే నెలాఖరులోపు చేయించుకోవచ్చు.
ఎలాంటి ఆందోళన వద్దు
జిల్లాలో ఈకేవైసీ లేని కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బియ్యం పంపిణీ చేసే సమయంలో ఎండీయూ ఆపరేటర్ల వద్ద కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈకేవైసీ లేని సభ్యులందరూ వచ్చే నెలాఖరులోపు చేయించుకోవాలి.
పద్మశ్రీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి