నకిలీ మొక్కజొన్న విత్తనాలతో మోసం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:21 AM
మండలంలోని తూర్పుకంభంపాడు గ్రామానికి చెందిన కోనేరు రామకోటేశ్వరరావు, గోరంట్ల వర ప్రసాదు, మానం వరలక్ష్మి తదితరులు సాగు చేసిన మొక్కజొన్న పైరు ఐదు నెలలు గడిచినా కంకులు రాలేదు. దీంతో తాము నకిలీ విత్తనాలతో మోస పోయామని లబోదిబోమంటున్నారు.

ఐదు నెలలైనా రాని కంకులు
ముండ్లమూరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తూర్పుకంభంపాడు గ్రామానికి చెందిన కోనేరు రామకోటేశ్వరరావు, గోరంట్ల వర ప్రసాదు, మానం వరలక్ష్మి తదితరులు సాగు చేసిన మొక్కజొన్న పైరు ఐదు నెలలు గడిచినా కంకులు రాలేదు. దీంతో తాము నకిలీ విత్తనాలతో మోస పోయామని లబోదిబోమంటున్నారు. గత ఏడాది నవంబరు 22వ తేదీన బాపట్ల జిల్లా పంగులూరు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన బాలాజీ సీడ్స్ షాపులో టైసన్ అనే మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. ఐదు నెలలైనా ఇంత వరకు కండె రావటం గాని, కొన్ని చోట్ల మూడు నుంచి ఐదు కండెలు రావటం జరగటంతో మోస పోయామని గ్రహించారు. ఇప్పటికే ఎకరానికి రూ.35 వేల వరకు ఖర్చు పెట్టారు. తీరా రైతులు పంట చేతికి వస్తుందనుకొనే సమయంలో నకిలీ మోస పోయామని లబోదిబోమంటున్నారు.దీంతో రైతులు బాలాజీ సీడ్స్ నిర్వాహకుల వద్దకు వెళ్లి తమకు నకిలీ విత్తనాలు అంటకట్టారని, తాము భారీగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ విషయాన్ని రైతులు బుధవారం సాయంత్రం ముండ్లమూరు వ్యవసాయ అధికారి ఎండీ ఫరూక్ వద్దకు వచ్చి విషయం తెలిపారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.