Share News

ముంచిన అకాల వర్షం

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:06 AM

ఎర్రగొండపాలెం గురువారం రాత్రి కురిసిన వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్తపల్లి, బోయలపల్లి, గురిజేపల్లి, అమానిగుడిపాడుతో పాటు పలు గ్రామాలలో భారి వర్షం కురిసింది. బొప్పాయి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ముంచిన అకాల వర్షం
కొమరోలులో గాలివానలకు నేలకొరిగిన అరటి తోటలు

పశ్చిమాన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వాన

గాలివానకు నేలకొరిగిన అరటి, మొక్కజొన్న, శనగ పంటలు

కొమరోలులో పిడుగుపాటుకు గేదెలు మృతి

కూలిన విద్యుత్‌ స్తంభాలు

పొంగిన వాగులు - ఆగిన రాకపోకలు

ఎర్రగొండపాలెం రూరల్‌ ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్తపల్లి, బోయలపల్లి, గురిజేపల్లి, అమానిగుడిపాడుతో పాటు పలు గ్రామాలలో భారి వర్షం కురిసింది. బొప్పాయి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంటలు దెబ్బ తినడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వెంకట సుబ్బయ్య, వెంకట రెడ్డి, శ్రీనివా్‌సలతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుంటనుంచి అమానిగుడిపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న ఒద్దులవాగు, గుడిపాడు నుంచి గుర్రపుశాల వెళ్లే దారిలోని రాళ్లవాగు, బోయలపల్లి నుంచి గురిజేపల్లి వెళ్లే రహదారిలోని కాశివరపు వాగులు 10 అడుగుల మేర పొంగిపొర్లడంతో అర్ధరాత్రి వరకు ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు ప్రజలు తెలిపారు. గురిజేపల్లి, ఎర్రగొండపాలెం, బోయలపల్లి, అమానిగుడిపాడు గ్రామాలలో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాలలో విద్యుత్‌ నిలిచిపోవడంతో కొన్ని గంటలపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దెబ్బతిన్న పంటలను ఉద్యానవనశాఖ అధికారులు, సిబ్బంది పరిశీలించి రైతుల పేర్లను నమోదు చేసుకున్నట్లు ఉద్యానవనశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు.

446 ఎకరాల్లో నేలకొరిగిన మొక్కజొన్న

రూ.2కోట్లకు పైగా నష్టం

బేస్తవారపేట, ఏప్రిల్‌4(ఆంధ్రజ్యోతి) : మండలంలో గురువారం రాత్రి వీచిన గాలులకు, అకాల వర్షానికి వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. చెరుకుపల్లె, గంటాపురం, పి.వి.పురం, అక్కపల్లె, జెన్నివారిపల్లె, పూసలపాడు, మోక్షగుండం గ్రామాల్లో సూమారు 446 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరగటంతో సుమారు రూ.2కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. సోమవారపేటలో 15 ఎకరాల్లో అరటి చెట్లు విరిగిపోవడంతో గెలలు కిందపడ్డాయి. వ్యవసాయ సిబ్బంది దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. త్వరలో నష్ట అంచనాలు వేస్తామన్నారు. మరో వారంలో చేతికి అందుతున్నదనుకున్న మొక్కజొన్న పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొక్కజొన్న, అరటి రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

పోతంపల్లి చెరువుకు గండి..

తాపీగా వచ్చిన అధికారులు

పెద్దారవీడు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారంరాత్రి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం భారీగా కురిసింది.తోకపల్లి, పోతంపల్లి గ్రామాలలో భారీ వర్షం కురిసింది. కళ్లాల్లో మిరపకాయలు ఆరబోసిన రైతులు కొంతమేర వాటిని తడవకుండా పట్టలు కప్పుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. పోతంపల్లి చెరువు భారీగా వర్షపునీరు చేరడంతో గండి పడింది. ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం అందించినా స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో పెద్దలు సొంత ఖర్చులతో ఎక్స్‌కవేటర్‌ సహాయంతో గండిని పూడ్చి చెరువు కట్టను పటిష్ట పరిచారు. చివరకు ఇరిగేషన్‌ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్థులు పూడ్చిన గండిని పరిశీలించారు.

Updated Date - Apr 05 , 2025 | 12:06 AM