Share News

Corruption : రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా!

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:34 AM

రైటర్స్‌ బ్లాక్‌ అనే ప్రైవేట్‌ కంపెనీకి ఏకంగా రూ.50 కోట్లు అడ్డగోలుగా చెల్లించేందుకు ఆ శాఖ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు.

Corruption : రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా!

  • అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్‌

  • శాఖలో ఉన్నతాధికారి పావులు

  • రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి

  • అప్పగించిన పని పూర్తి చేయకపోయినా నాణ్యత లేకున్నా చెల్లింపునకు ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఓ కాంట్రాక్టు సంస్థకు కానీ లేదా కంపెనీకి కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటే ఆ మేరకు అప్పగించిన పని పూర్తి చేయాలి. అది కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలి. కానీ పని పూర్తి చేయకపోయినా, చేసిన పనిలో కూడా నాణ్యత లేకపోయినా ఓ కంపెనీకి అప్పనంగా మొత్తం బిల్లులు చెల్లించేందుకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో ఉన్నతాధికారి ఒకరు పావులు కదుపుతున్నారు. రైటర్స్‌ బ్లాక్‌ అనే ప్రైవేట్‌ కంపెనీకి ఏకంగా రూ.50 కోట్లు అడ్డగోలుగా చెల్లించేందుకు ఆ శాఖ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీ, రిజిస్ర్టేషన్ల శాఖకు కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పగించిన 3 పనులు పూర్తి చేస్తేనే చెల్లింపులు జరుగుతాయని స్పష్టంగా ఉంది. ఒప్పందం మేరకు ఆ కంపెనీ పనులు పూర్తి చేయలేదు. అయినా ఆ కంపెనీకి మొత్తం బిల్లులు చెల్లించాలని రిజిస్ర్టేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నారు. భూరికార్డులను డిజిటల్‌గా భద్రపరచడం కోసం జాతీయ సంస్థ ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయి. ఆ నిధులను రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీకి చెల్లించేందుకు ఆ అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


చేయాల్సిన పనులివీ...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో 3 రకాల సేవలందించడానికి గత వైసీపీ ప్రభుత్వంలో రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీని నియమించుకున్నారు. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో నమోదవుతున్న డాక్యుమెంట్లను ఈ కంపెనీ స్కానింగ్‌ చేయాలి. సరిగ్గా స్కాన్‌ కాని డాక్యుమెంట్లను తిరిగి స్కానింగ్‌ చేయాలి. అలాగే రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌లోని పేరు, ఊరు, సర్వే నెంబర్‌ లాంటి కీలక వివరాలను డాక్యుమెంట్ల వారీగా భద్రపరచాలి. వీటిని మెటాడేటా ఫీల్డ్స్‌ అంటారు. కానీ ఈ మూడు పనుల్లో ఏ ఒక్కటి కూడా ఆ కంపెనీ పూర్తి చేయలేదు. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల స్కానింగ్‌ చేసినప్పటికీ అందులో ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదని, అన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయని రిజిస్ర్టేషన్ల శాఖ వాటిని ఆమోదించలేదు. అయినప్పటికీ తప్పును సరిదిద్దుకోకుండా నాణ్యత సరిగ్గా లేని స్కానింగ్‌నే ఆ కంపెనీ కొనసాగించింది. అభ్యంతరం చెప్పినా పద్ధతి మార్చుకోలేదు.

ఇదీ ప్రాజెక్టు లక్ష్యం

స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ... ఆదాయం ఆర్జించే, ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖ కావడంతో సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుంది. ఫిజికల్‌ రికార్డుల కంటే డిజిటల్‌ రికార్డులు భద్రపరచడం సులువు, సురక్షితం కూడా. ఒకవేళ డిజిటల్‌ డేటా పోయినా పునరుద్ధరించడం కోసం మెటాడేటా ఫీల్డ్స్‌ను కూడా సిద్ధం చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రజల ఆస్తులకు సంబంధించిన ఈ డేటాను సురక్షితంగా ఉంచి, భూవ్యవహారాలు సజావుగా సాగేందుకోసం ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ ఈ ప్రాజెక్టులకు నిధులిస్తోంది. ఫిజికల్‌ కాపీలు, డిజిటల్‌ కాపీలు పోతే భూ వ్యవహారాలన్నీ గందరగోళం అయిపోతాయి. ఎవరి భూములకూ చట్టప్రకారం రక్షణ ఉండదు. అందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో భాగంగా డాక్యుమెంట్ల స్కానింగ్‌, వాటి నాణ్యత పరిశీలన, మెటాడేటా ఫీల్డ్స్‌ పూర్తయ్యాయని అధికారులు ధ్రువీకరిస్తే ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయి.


ఎందుకీ అత్యుత్సాహం?

గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా కొందరి తీరు మారడం లేదు. రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీ నిబంధనల ప్రకారం పని చేయలేదు కావున బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో ఉన్నతాధికారి ఒకరు అత్యుత్సాహం చూపుతున్నారు. ఈ విషయంలో ఆ అధికారికి వ్యక్తిగత ఆసక్తి ఎందుకో? ఆ కంపెనీకి బిల్లులు చెల్లిస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటో? ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ నుంచి నిధులు తెచ్చి రైటర్స్‌ బ్లాక్‌ కంపెనీకి ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా కమిషన్ల కోసం అడ్డదారి తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Feb 20 , 2025 | 05:34 AM