అభివృద్ధికి పన్నులే ఆధారం
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:22 AM
పట్టణాల్లో కీలక ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా ప్రగతి సాధించి ఫర్వాలేదనిపించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మునిసిపాలిటీలు పోటీపడి మరీ లక్ష్యాలకు చేరువయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని మునిసిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్ ముందంజలోనే ఉన్నాయి.

వసూళ్లలో మునిసిపాలిటీలు పురోగతి
కలిసొచ్చిన 50శాతం వడ్డీ రాయితీ
ప్రథమ స్థానంలో చీమకుర్తి... అట్టడుగున పొదిలి
గతేడాది కంటే రూ.10 కోట్ల అదనపు ఆదాయంలో ఒంగోలు
జిల్లాలో రూ.77.41 కోట్ల డిమాండ్.. రూ.52.74 కోట్లు వసూలు
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో కీలక ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా ప్రగతి సాధించి ఫర్వాలేదనిపించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మునిసిపాలిటీలు పోటీపడి మరీ లక్ష్యాలకు చేరువయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని మునిసిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్ ముందంజలోనే ఉన్నాయి. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, దర్శి, పొదిలి మునిసిపాలిటీలునూరుశాతం వసూలు లక్ష్యంగా ముందుకు సాగాయి. అయితే గతనెల పదో తేదీ వరకు నత్తనడకన పన్నుల వసూలు జరిగింది. అయితే ప్రభుత్వం వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించడంతో అందుకు అనుగుణంగా కమిషనర్లు ప్రజల్లో అవగాహన పెంచారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులయ్యారు. చీమకుర్తి 85.9శాతం వసూలు చేసి జిల్లాలో ప్రథమస్థానంలో ఉండగా,46.21 శాతం మాత్రమే సాధించి పొదిలి ఆఖరి స్థానంలో నిలిచింది. ఒంగోలు కార్పొరేషన్‌లో అత్యధిక డిమాండ్ ఉండటంతో 66.73 శాతం వసూలు చేసింది. గడిచిన ఏడాదితో పోల్చుకుంటే రూ.10కోట్లు అదనంగా వసూలు చేసి ఫర్వాలేదనిపించుకుంది. మొత్తంగా వడ్డీపై యాభై శాతం రాయితీ కలిసి రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఫండ్‌కు ఢోకా లేదనే చెప్పొచ్చు. జిల్లాలో 1,28,213 అసెస్‌మెంట్‌లకు సంబంధించి మార్చి 31 నాటికి రూ.77.41 కోట్లు పన్ను వసూలు చేయాల్సి ఉంది. అందులో రూ.52.74 కోట్లు (68.14శాతం) వసూలు చేసి లక్ష్యాలను చేరుకున్నారు.
గత వైసీపీ పాలనలో పేరుకుపోయిన బకాయిలు
గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల ప్రగతి గురించి పట్టించుకోకపోవడంతో పెద్దమొత్తంలో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నిన్న మొన్నటి వరకు పురపాలక సంస్థల్లోఆర్థిక సంక్షోభం నెలకొంది. వాస్తవానికి ప్రజలు పన్నుల రూపంలోచెల్లించిన నిధుల (జనరల్ ఫండ్)తో రోడ్లు, డ్రైన్లు, భవనాల నిర్మాణం, ప్రహరీగోడలు, పార్కుల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగు, తాగునీటి సరఫరా నిర్వహణ, కొత్తగా పైపులైన్లు, పాత వాటికి మరమ్మతులు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి చేయాల్సి ఉంది. గత పాలకులు పారిశుధ్యం, తాగునీటి సరఫరాకే పరిమితమయ్యారు. దీంతో ఉన్న నిధులు కాస్తా కరిగిపోయి ఖజానా ఖాళీ అయ్యింది. తాజాగా ప్రభుత్వం వడ్డీరాయితీ అవకాశం ఇవ్వడంతో ఒంగోలు నగరం, ఇతర పట్టణాలకు కొంత ఊరట లభించింది.
మొదటి స్థానంలో చీమకుర్తి.. ఆఖరిలో పొదిలి
చీమకుర్తి మునిసిపాలిటీలో 6,659 అసెస్‌మెంట్‌లు ఉండగా, రూ.3.34 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అందులో రూ.2.84 కోట్లు (85.09 శాతం) రాబట్టి జిల్లాలోనేప్రఽథమస్థానంలో నిలిచింది. గిద్దలూరులో11,544 అసెస్‌మెంట్‌లకు సంబంధించి రూ.4.03 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అందులో రూ.3.17 కోట్లు (78.66) శాతం వసూలు చేసి ద్వితీయ స్థానంలో నిలిచింది. మార్కాపురంలో రూ.8.56 కోట్ల వసూలుకు గాను రూ.6.10 కోట్లు (71.26 శాతం) రాబట్టి మూడో స్థానంలో ఉంది. కనిగిరిలో 9,411 అసెస్‌మెంట్‌లకు రూ.4.20 కోట్లు వసూలు లక్ష్యం. అందులో రూ. 2.96 కోట్లు (70.61శాతం) వసూలు చేసి నాల్గోస్థానంలో నిలిచింది. దర్శిలో 9,437 అసెస్‌మెంట్లకుగాను రూ.5.05 కోట్లు రావాల్సి ఉంది. రూ.3.37 (66.72)శాతం వసూలు చేసి ఐదోస్థానంలో ఉంది. పొదిలిలో 10,806 అసెస్‌మెంట్‌లకు రూ.3.16 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అందులో రూ.1.55 కోట్లు (49.21 శాతం)మాత్రమే వసూలు చేసి ఆఖరి స్థానంలో నిలిచింది.
అప్పుల నుంచి ఆదాయంలోకి కార్పొరేషన్
వైసీపీ పాలనలో పన్నుల వసూళ్లను పట్టించుకోకపోవడంతో అప్పులతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఒంగోలు కార్పొరేషన్ తాజాగా ఆ పరిస్థితి నుంచి బయటపడింది. ఫిబ్రవరి మొదటి వారానికి కార్పొరేషన్ ఖాజానాలో కేవలం రూ.3.37 కోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కార్యాలయ నిర్వహణ, కాంట్రాక్టు ఉద్యోగులు జీతాలు, కరెంటు బిల్లులు, ఇతరత్రా అత్యవసర అవసరాలకే సరిపడే పరిస్థితి. దీంతో ఆదాయ వనరులపై దృష్టి సారించిన కార్పొరేషన్ ప్రభుత్వ ఖాళీస్థలాల లీజు, మొండిబకాయిదారులకు నోటీసులతో ఆదాయ వృద్ధివైపు అడుగులు వేసింది. మార్చి 15వ తేదీ వరకు పన్నుల వసూలు అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం వడ్డీపై యాభె ౖశాతం రాయితీ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు సెలవు రోజుల్లోనూ పన్నులు వసూలు చేశారు. నగరంలో మొత్తం 63,302 అసెస్‌మెంట్‌లు ఉండగా, రూ.49.08 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీంతో కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలతో కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రణాళిక రూపొందించారు. ప్రతిరోజూ వసూలు నివేదికలు, టెలీకాన్ఫరెన్స్‌లు, అవసరమైతే నేరుగా వసూళ్లకు రంగంలోకి దిగారు. గతేడాది మార్చి 31 నాటికంటే ఈ ఏడాది రూ.10కోట్లు అదనంగా వసూలు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు.