భవిష్యత్‌కు భరోసా
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:26 AM
సాగునీటి సౌకర్యం అంతగా లేక, ఉపాధి అవకాశాలు కరువై శతాబ్దాల కాలంగా బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు వలసలు వెళ్తున్న జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజల భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది.

పశ్చిమప్రాంతంలో పారిశ్రామిక వెలుగులకు నేడు పునాది
దివాకరపల్లి వద్ద రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ
హాజరుకానున్న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ, మంత్రులు
జిల్లాలో మరో నాలుగు కూడా ఏర్పాటు
ఇంకోవైపు అలా్ట్ర మెగా సోలార్ ప్లాంట్లు
నిమ్జ్, దొనకొండ కారిడార్‌లను కదిలిస్తే ప్రగతి పరుగు
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కీలకం
ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీ నిర్మాణాలూ అవసరం
సాగునీటి సౌకర్యం అంతగా లేక, ఉపాధి అవకాశాలు కరువై శతాబ్దాల కాలంగా బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు వలసలు వెళ్తున్న జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజల భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. సాగు, తాగునీటి సౌకర్యాలు, పారిశ్రామిక.. ఇతర మౌలిక రంగాలైన విద్య, వైద్యం, రోడ్లు, రైల్వే సౌకర్యాల పెంపునకు కూటమి ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధమైన చర్యలు సాగుతున్నాయి. అందులో అత్యంత కీలకమైన పారిశ్రామిక వెలుగులకు బుధవారం పునాది పడుతోంది. వెనుకబాటు, వలసలు అధికంగా ఉన్న కనిగిరి నియోజకవర్గంలో ఇందుకు తొలి అడుగుగా రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ స్థాపించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లలో మొదటిది ఏర్పాటు కానుంది.
ఒంగోలు ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రూ.65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ, ప్రభుత్వానికి మధ్య ఇటీవల ఒప్పందం కుది రింది. పెద్దఎత్తున భూములు ఇందుకు అవసరం కాగా మన జిల్లాలో విస్తారంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది. రిలయన్స్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం మంత్రి నారా లోకేష్ కాగా.. ఆయన తొలి ప్లాంట్ కనిగిరి ప్రాంతంలో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ల చొరవ కూడా అందుకు ఉపకరించింది. కాగా రాష్ట్రంలో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించిన రిలయన్స్ అందులో కనీసం నాలుగింటిని జిల్లాలో స్థాపించనుంది. ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలతో జిల్లా యంత్రాంగం కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం పరిధిలోని కొనకనమిట్ల మండలాల్లో ఇప్పటికే 4,900 ఎకరాల భూమిని గుర్తించారు. తొలిగా పీసీపల్లి మం డలం దివాకరపల్లి సమీపంలో 459 ఎకరాలలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బుధవారం రాష్ట్రమంత్రి నారా లోకేష్, రిలయన్స్ సంస్థ అధిపతి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ భూమిపూజ చేయనున్నారు.
పర్యావరణ హిత ప్రాజెక్టు
పర్యావరణ, ఇతరత్రా సమస్యలు లేకుండా బీడు భూముల్లో బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగించే గడ్డి పెంపకం చేపడతారు. దానిని కట్ చేసి గ్యాస్ తయారు చేస్తారు. గడ్డి పెంపకం కోసం భూములిచ్చే రైతుల్లో పట్టాదారులకు ఏడాదికి రూ.31వేలు, అసైన్డ్‌భూములకు రూ.15వేలు కౌలు ఇవ్వనున్నారు. అలాగే గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దివాకరపల్లి పర్యటన సందర్భంగా ప్రకటించడం పశ్చిమప్రాంత ప్రజల్లో మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. కాగా దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలం రుద్రసముద్రం, కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలాల్లో రాష్ట్రప్రభుత్వం అలా్ట్ర మెగా సోలార్ ప్లాంట్లను ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసీఐ) 2024 పాలసీలో భాగంగా దేశంలోనే పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచే లక్ష్యంతో 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.
రూ.10వేల కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో సుమారు రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు, 7.50 లక్షల ఉద్యోగాల కల్పన రానున్న ఐదేళ్లలో రానున్నాయి. అందులో తాజాగా జిల్లాకు ఒక్కొక్కటి వెయ్యి మెగావాట్ల సామార్థ్యం ఉన్న రెండు అలా్ట్ర మెగా సోలార్ ప్లాంట్లు మంజూరు చేసినట్లు తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం ప్రకటించింది. అలా ఒకవైపు రిలయన్స్ ప్లాంట్లు, మరోవైపు అల్ర్టామోగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో పశ్చిమప్రాంతంలో పారిశ్రామిక వెలుగులు రానున్నాయి. వీటి ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ప్రత్యేకించి యువతకు ఉపాధి లభించనుంది. ఇదే సమయంలో ఇప్పటికే పశ్చిమప్రాంతంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించి పూర్తిచేయడం ద్వారా భవిష్యత్ జీవనానికి భరోసా కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
కీలక ప్రాజెక్టులపై ఆశలు
గతంలో టీడీపీ ప్రభుత్వంలో దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు జరిగింది. దొనకొండ మండలంలో సుమారు 25వేల ఎకరాలకు పైగా భూములను సర్వే చేసి పరిశ్రమల ఏర్పాటుకు గుర్తించారు. అంతకు ముందే కేంద్రం కనిగిరి ప్రాంతానికి జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన జోన్(నిమ్జ్)ను మంజూరు చేయగా నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాథమిక చర్యలు తీసుకుంది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రెండింటినీ గాలికొదిలేసింది. ట్రిపుల్ ఐటీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, సర్వజన ఆస్పత్రి నిర్మాణాలు అత్యంత ఆవశ్యంగా ప్రజానీకం కోరుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి నీరు ఇవ్వాలన్న కోరిక ఆ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. ప్రభుత్వంలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ అత్యంత కీలకంగా ఉన్న మంత్రి నారా లోకేష్ పశ్చిమప్రాంతంపై దృష్టిపెట్టి రిలయన్స్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటుకు కృషిచేశారన్న సమాచారంతో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై కూడా దృష్టిపెట్టాలని పశ్చిమప్రాంత ప్రజలు కోరుతున్నారు.
వెలిగొండనే అన్నింటికీ ఆధారం
పశ్చిమప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తీర్చడానికి వెలిగొండ తప్ప మరొక మార్గం లేదు. అలాగే పారిశ్రామిక అవసరాలకు కూడా వెలిగొండ పూర్తిచేస్తేనే తప్ప నీటి లభ్యత ఉండదన్న విషయాన్ని పాలక పెద్దలు గుర్తించాలని ప్రజానీకం కోరుతోంది. పశ్చిమప్రాంతంలో నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు సాగుతూ రవాణా సౌకర్యాలు భారీగా మెరుగుపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక వెలుగులు, వెలిగొండ పూర్తి, ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి కీలక పనులు పూర్తితోపాటు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే దశాబ్దాల కాలంగా కొనసాగతు ఉన్న సమస్యలు తీరతాయి. వలసలు నివారణ జరిగి ఉపాధికి, భవిష్యత్ జీవనానికి భరోసా లభిస్తుంది. ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించాలని ఆ ప్రాంత ప్రజానీకం కోరుతున్నారు.