ఉత్సాహంగా పింఛన్‌ల పంపిణీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:23 AM
జిల్లావ్యాప్తంగా మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఉదయం ఏడు గంటల నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు మొత్తాలు అందజేయడం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,83,217 మంది లబ్ధిదారులకు వివిధ కేటగిరీలలో రూ.124.5 కోట్ల నగదు మంజూరు కాగా ఉదయం పది గంటలకే 60శాతం మందికి పంపిణీ చేశారు.

పైడిపాడులో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి
ఇతరచోట్ల ముఖ్యనేతలు, అధికారులు హాజరు
ఇంటింటికీ వెళ్లి అందజేసిన సిబ్బంది
ఒంగోలు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఉదయం ఏడు గంటల నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు మొత్తాలు అందజేయడం ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,83,217 మంది లబ్ధిదారులకు వివిధ కేటగిరీలలో రూ.124.5 కోట్ల నగదు మంజూరు కాగా ఉదయం పది గంటలకే 60శాతం మందికి పంపిణీ చేశారు. సాయంత్రం ఐదు గంటలకు 89శాతంతో 2,52,013 మందికి రూ.189.28 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అందుబాటులో ఉన్న వారికి రాత్రి కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా మంత్రి నుంచి గ్రామస్థాయిలోని టీడీపీ నాయకుల వరకు.. అలాగే జిల్లా మండల స్థాయి అధికారులు ఫించన్ల పంపిణీలో పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి తన నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి మండలం పైడిపాడులో పింఛన్లు పంపిణీ చేశారు. అనం తరం జరిగిన సభలో రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉన్నా పేదల సంక్షేమం కోసం ప్రతినెలా 1న రూ.2,722 కోట్లను 63 లక్షల మంది పింఛన్‌దారులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ4 సర్వేను సీఎం ప్రారంభించారన్నారు. కాగా ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ మంగళవారం ఉదయం ఎన్‌జీపాడు మండలం చేకూరపాడు, ఉప్పుగుండూరులలో పింఛన్లు పంపిణీ చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పీసీపల్లి మండలం వెంగళాయపల్లిలో పాల్గొన్నారు. టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు వైపాలెంలోనూ, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలంలో అందజేశారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దర్శి పట్టణంలో పంపిణీ చేశారు. పలు మండలాలు, పట్టణాలలో స్థానిక అధికారులు, సిబ్బందితో కలిసి టీడీపీ ముఖ్య నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు.