Share News

Pasala Krishna Bharathi: ప్రముఖ గాంధేయవాది కృష్ణభారతి కన్నుమూత

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:14 AM

సమాజంలోని చివరి వ్యక్తివరకు విద్యను తీసుకెళ్లడంకోసం సేవాభావంతో కృష్ణభారతి చేసిన కృషి యావత్తు దేశాన్ని ఆకర్షించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 2022 జూలైలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ

Pasala Krishna Bharathi: ప్రముఖ గాంధేయవాది కృష్ణభారతి కన్నుమూత

92 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో తుదిశ్వాస

సేవాభావంతో దేశాన్ని ఆకర్షించిన కృష్ణభారతి

తల్లిదండ్రులనుంచి స్వాతంత్య్ర సమర వారసత్వం

జైలులో జన్మించడంతో కృష్ణ భారతిగా నామకరణం

అల్లూరి విగ్రహసభలో కృష్ణభారతికి మోదీ పాదాభివందనం

రాష్ట్రంలో విద్యావ్యాప్తికి అసమాన కృషి : చంద్రబాబు నివాళి

హైదరాబాద్‌లో ముగిసిన అంత్యక్రియలు

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి (92) కన్నుమూశారు. ఆదివారం హైదరాబాద్‌లోని స్నేహపురి కాలనీలోని సోదరి నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సమాజంలోని చివరి వ్యక్తివరకు విద్యను తీసుకెళ్లడంకోసం సేవాభావంతో కృష్ణభారతి చేసిన కృషి యావత్తు దేశాన్ని ఆకర్షించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 2022 జూలైలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సభలో కృష్ణభారతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాదాభివందనం చేసి సత్కరించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన సోదరి వీణ నివాసంలో కొంతకాలంగా ఉంటున్నారు. అక్కడే కృష్ణభారతి మృతిచెందారు. ఆమె పార్ధివదేహానికి బంధువులు, ఆత్మీయుల సమక్షంలో హైదరాబాద్‌లో అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు.

కృష్ణ జన్మస్థానంలో జననం..

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రుకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోఽధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జాతీయోద్యమంలో భాగంగా వారు జైలు జీవితం గడిపారు. జైలుకు వెళ్లే సమయానికి అంజలక్ష్మి ఆరునెలల గర్భిణి. జైలులోనే కృష్ణభారతికి జన్మనిచ్చారు. కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుణ్ణి, స్వతంత్ర భారత ఆకాంక్షను గుర్తుచేస్తూ కుమార్తెకు వారు కృష్ణ భారతి అని నామకరణం చేశారు. ఆమె అన్నప్రాసన జైలులోనే తోటి రాజకీయ ఖైదీల సమక్షంలో జరిగింది. పుట్టిన పదినెలల వరకు బాల్యం జైలులోనే గడిచింది.


సమరయోధుల పింఛన్‌ తిరస్కరించి..

కృష్ణభారతి తల్లిదండ్రులు వారి ఆస్తిమొత్తాన్ని స్వాతంత్య్ర పోరాటం కోసం దానం చేశారు. వారి స్ఫూర్తితో ఆమె చివరివరకు గాంధేయవాదిగా గడిపారు. అవివాహితగా పూర్తి జీవితం సమాజ సేవకే అంకితం చేశారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా అనేక సాంఘిక సంస్కరణలను ఆమె చేపట్టారు. దళితుల్లో విద్యావ్యాప్తికి కృషిచేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. తనకు సంక్రమించిన నాలుగు ఎకరాల భూమిని హరిజనవాడకు అందించారు. మరో ఎకరాన్ని విద్యాసంస్థలకు దానం చేశారు. కుష్ఠురోగులకు సేవలు అందించారు. జైలులో పుట్టినందున కేంద్ర ప్రభుత్వం కృష్ణభారతిని స్వాతంత్య్ర సమరయోధురాలుగా పరిగణించి పెన్షన్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే దానిని ఆమె తిరస్కరించారు.

బ్రిటిష్‌ ఆంక్షలు ధిక్కరించి జెండా రెపరెపలు..

గాంధీజీ పశ్చిమ గోదావరిజిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణ భారతి తండ్రి కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీవ్ర ఆంక్షలు ధిక్కరించి భీమవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంపై 1932లో భారత జాతీయ జెండా ఎగురవేశారు. ఇందుకుగాను సతీమణి అంజలక్ష్మితో కలిసి ఆయన జైలుశిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం వినోబా భావే భూదానోద్యమంలో కృష్ణమూర్తి, అంజలక్ష్మి పాల్గొని తన గ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారికి నిజమైన వారసురాలిగా కృష్ణ భారతి నిలిచారని పలువురు నివాళులు అర్పించారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో విద్యావ్యాప్తికి అసమాన కృషి చేశారంటూ ‘ఎక్స్‌’ఖాతాలో నివాళులు అర్పించారు.


ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 03:14 AM