కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:11 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 6.15 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది.

13మంది ప్రయాణికులకు గాయాలు
చౌటుప్పల్ రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 6.15 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని నెమ్మది చేశాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో ఇదే వరుసలో బస్సు వెనుక ఉన్న సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 50 మంది ఉండగా, 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్తగా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా రోడ్డుపై నడుపుతూ అకస్మాత్తుగా నెమ్మది చేయడంతో వెనుకనుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ముప్పరాజు మణికంఠ, సుజితకుమార్, శ్రీపాద విజయ్, పోలుకొండ అనూష, మణి విశ్వనాథ్, బిపన నాయుడు, బీదన సూతార్, రాయపురెడ్డి వీరవాణి, ఓలేటి మౌనిక, జగన్నాథ్, కాట్రగడ్డ సాయి చైతన్య, గడ్డం కిశోర్, శ్రీమన్నారాయణలు ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ శివరామకృష్ణ క్యాబినలో ఇరుక్కుపోవడంతో పోలీసులు శ్రమించి బయటకు తీసి ప్రాణాలను రక్షించారు. అయితే ఈ ఘటనలో శివరామకృష్ణ రెండు కాళ్లు విరిగాయి. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు అరగంట మేర ట్రాఫిక్ జామ్‌కాగా, కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాద ఘటనపై కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధకుమార్ తెలిపారు. సాయికృష్ణ ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.