Share News

బిల్లు కావాలా.. లంచం ఇవ్వు

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:12 AM

జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

   బిల్లు కావాలా.. లంచం ఇవ్వు
లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులకు చిక్కిన జిల్లా మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య

- రూ.60వేలు డిమాండ్‌ చేసిన జిల్లా మత్స్యశాఖ అధికారి

- ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

- దాడిచేసి పట్టుకున్న అధికారులు

పార్వతీపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. చేప పిల్లల బిల్లు చెల్లించేందుకు గాను బాధితుడి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి వివరాల మేరకు.. పాలకొండ మండలం టీడీ పారాపురానికి చెందిన కోటదుర్గ గిరిజన ఫిష్‌ సీడ్‌ సంస్థ యజమాని బొప్పన అప్పన్నదొర పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజన మత్స్యకారులకు, అదే విధంగా జిల్లాలోని చెరువులకు చేప పిల్లలను సరఫరా చేశారు. దీనికి సంబంధించి ఆయనకు రూ.60 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలంటే రూ.60 వేలు లంచం ఇవ్వాలని జిల్లా మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య డిమాండ్‌ చేశారు. దీంతో అప్పన్నదొర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం రూ.60వేలు తీసుకెళ్లి తిరుపతయ్యకు అందజేశాడు. ఆ డబ్బులను తిరుపతయ్య తన టేబుల్‌ డ్రాయర్‌లో పెడుతుండగా విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, ఎస్‌ఐ వాసునారాయణ, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. తిరుపతయ్యను గురువారం విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 12:12 AM