ప్రోత్సహిస్తే ప్రయోజనం
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:10 AM
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వనమూలికలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో రకాల వనమూలికలు లభ్యమవుతుంటాయి.

- ఏజెన్సీలో పెద్దఎత్తున వనమూలికలు లభ్యం
- సేకరణపై గిరిజనులకు కొరవడిన అవగాహన
-నేలపాలవుతున్న విలువైన అటవీ సంపద
- జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తే మంచి ఫలితాలు
గుమ్మలక్ష్మీపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వనమూలికలకు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో రకాల వనమూలికలు లభ్యమవుతుంటాయి. అయితే, వీటి సేకరణపై గిరిజనులకు అవగాహన లేకపోవడంతో విలువైన వనమూలికలు నేలపాలవుతున్నాయి. వనమూలికలను సేకరించేలా గిరిజనులను ప్రోత్సహించడంతో పాటు జీసీసీ ద్వారా వాటిని కొనుగోలు చేస్తే ఎంతో ప్రయోజనం కలగనుంది. జిల్లాలోని సీతంపేట, దోనుబాయి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, మక్కువ, పాచిపెంట ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటవీ ఫలసాయాలతో పాటుగా పెద్ద ఎత్తున వనమూలికలు కూడా ప్రకృతి సిద్ధంగా లభిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న సవర, జాతాపు తెగ గిరిజనులు వారి జీవనోపాధి కోసం చింతపండు, కొండ చీపుర్లు, కరక్కాయలు, నరమామిడి చెక్క, నల్లజీడి పిక్కలు తదితర అటవీ ఫలసాయాలు సేకరిస్తుంటారు. వీటితో పాటు ఈ ప్రాంతాల్లో నేలవేము, పాతాళగిరడ, సరస్వతి ఆకు, గులివెంద గింజలు, ఇందుగ పిక్కలు, గుగ్గిలం, అశ్వగంధి తదితర 40 రకాల వనమూలికలు అభ్యమవుతున్నాయి. కానీ, వీటి సేకరణపై గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. గతంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన టి.విజయకుమార్ వనమూలికల సేకరణపై దృష్టి సారించారు. ఏయే రకాల వనమూలికలు దొరుకుతున్నాయో సర్వే కూడా చేశారు. హెర్బోనియం ప్రిపేర్ చేశారు. ఆయన హయాంలో జీసీసీ ద్వారా వనమూలికలు కొనుగోలు చేసేవారు. వాటిని జండు, డాబర్, హిమాలయ తదితర ఆయుర్వేద ఔషధాలు తయారు చేసే సంస్థలకు అమ్మేవారు. ఆయన బదిలీ తర్వాత వచ్చిన అధికారులు వనమూలికల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గిరిజనులు వాటిని సేకరించడం లేదు. దీంతో జిల్లా అటవీ ప్రాంతంలో లభించే ఎన్నో వనమూలికలు నేలపాలు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వనమూలికల సేకరణపై గిరిజనులకు శిక్షణ ఇచ్చి, వాటిని కొనుగోలు చేసి మార్కెటింగ్ కల్పిస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది.
వనమూలికలు సేకరించాలి
వనమూలికల సేకరణపై గిరిజనులకు అవగాహన కల్పించాలి. జీసీసీ ద్వారా వాటిని కొనుగోలు చేస్తే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. దీనికోసం సంబంధిత అధికారులు కృషి చేయాలి.
-ఆరిక సోములు, రైతు, తాడికొండ
ఉన్నతాధికారులు ఆదేశిస్తే సేకరిస్తాం
మా ఉన్నతాధికారులు ఆదేశిస్తే వనమూలికల సేకరణపై గిరిజనులకు అవగాహన కల్పిస్తాం. వాటిని కొనుగోలు చేసేందుకు తగిన ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అటవీ ఫలసాయాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాం.
- కృష్ణ ప్రసాద్, జీసీసీ మేనేజర్, గుమ్మలక్ష్మీపురం