Reliance Green Energy: సీబీజీ ప్లాంటుకు తొలి అడుగు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:05 AM
ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. తొలిప్లాంట్‌ను ప్రకాశం జిల్లాలో ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేశ్ కలిసి శంకుస్థాపన చేయనున్నారు

రేపు కనిగిరిలో లోకేశ్, అనంత్ అంబానీ శంకుస్థాపన
రాష్ట్రవ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లు: గొట్టిపాటి
అమరావతి, పీసీపల్లి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటులో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా మొదటి దానికి బుధవారం శంకుస్థాపన జరగనుంది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో స్థాపించనున్న తొలి సీబీజీ ప్లాంటుకు మంత్రి నారా లోకేశ్‌తో కలిసి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఈ నెల 2న శంకుస్థాపన చేయనున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం వెల్లడించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో బుధవారం భూమిపూజ చేయనున్న ప్లాంట్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ రాష్ట్రవ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లు స్థాపించనుందని, వీటి కోసం ఆ సంస్థ ప్రైవేటు భూములను లీజుకు సేకరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో బీడు భూములను కూడా లీజుకు తీసుకోవడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించారు. ఈ ప్లాంట్ల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలూ దక్కుతాయని అన్నారు. రైతులు కౌలుకు ఇచ్చినా ఏటా రూ.4వేల నుంచి రూ.5వేలు కూడా దక్కని భూములను గుర్తించామని అన్నారు. ప్రభుత్వ భూములకు ఎకరాకు రూ.15వేలు, ప్రైవేటు భూములకు ఎకరాకు రూ.31 వేలు చెల్లిస్తుందని వివరించారు. ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో 100 టన్నుల సామర్థ్యంతో సీబీజీ ప్లాంటు నిర్మాణాన్ని చేపడుతుందని, త్వరలోనే గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కొండపిలోనూ ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆయన వెంట కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఉన్నారు.