Heatwave: వచ్చే 3 నెలలు ఎండలతో జాగ్రత్త!
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:52 AM
రానున్న మూడు నెలలు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గురువారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేయాలి
అధికారులకు సీఎస్ ఆదేశాలు
అమరావతి/విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. రానున్న మూడు నెలలు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గురువారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు విపత్తు నిర్వహణ సంస్థతో సహా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల పరీక్షా కేంద్రాల్లోనూ తాగునీరు, నిరంతర విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారి పర్యవేక్షణలో వేసవి ప్రణాళికల అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏయే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయో, వడగాడ్పులు వీస్తాయో ముందుగానే సంక్షిప్త సందేశాలు జారీ చేసి, ప్రజల్ని అప్రమత్తం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ మాట్లాడుతూ వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా తాము అలెర్ట్ మెస్సేజ్‌లు జారీ చేస్తున్నామని తెలిపారు.
రాయలసీమలో ఎండల తీవ్రత
వాయవ్య గాలుల ప్రభావంతో రాయలసీమలో ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 49 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
సీఎం ఆదేశాలతో
పశువుల యూనిట్లు మంజూరు
సీఎం చంద్రబాబు హామీ మేరకు శ్రీకాకుళం జిల్లాలో పశుపోషకులకు 7 పాడి గేదెల యూనిట్లు, 15 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో పాడి రైతుకు రూ.లక్ష చొప్పన 7 పాడి గేదెల యూనిట్లు, ఒక్కో గొర్రెల కాపరికి రూ.2.20 లక్షల చొప్పున (20+1 గొర్రెలు) 15 యూనిట్లకు ప్రభుత్వం రూ.33 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.