Share News

Aadhar: ప్రజలకు ‘ఆధార్‌’ కష్టాలు

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:55 PM

Identity Verification Problems జిల్లా ప్రజలకు ‘ఆధార్‌’ కష్టాలు తప్పడం లేదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ‘ఆధార్‌’లో పేర్లు, వివరాలు తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని సూచించింది.

Aadhar: ప్రజలకు ‘ఆధార్‌’ కష్టాలు
శ్రీకాకుళంలో బ్యాంకు వద్ద ‘ఆధార్‌’ సేవల కోసం నిరీక్షిస్తున్న ప్రజలు

  • శ్రీకాకుళంలో ఒకే ఒక్క బ్యాంకులో అప్‌డేట్‌ సేవలు

  • ఉదయం నుంచీ పడిగాపులు

  • పోస్టాఫీసు, నెట్‌సెంటర్ల వద్ద బారులు

  • సాంకేతిక సమస్యతో ఇబ్బందులు

  • శ్రీకాకుళం అర్బన్‌/ సోంపేట, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు ‘ఆధార్‌’ కష్టాలు తప్పడం లేదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ‘ఆధార్‌’లో పేర్లు, వివరాలు తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఐదేళ్లు దాటిన చిన్నారుల వేలిముద్రలు అప్‌డేట్‌ చేసేందుకుగానూ రేషన్‌కార్డుదారులు ‘ఆధార్‌’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. శ్రీకాకుళంలోని కర్ణాటక బ్యాంకులో మాత్రమే ఆధార్‌ అప్‌డేట్‌ సేవలకు అవకాశం కల్పించారు. అదీ రోజుకు 30 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే వేలిముద్రలు, వివరాలు అప్‌డేట్‌ చేస్తున్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం కూడా ఉదయం 7 గంటలకే బ్యాంకు వద్దకు కొంతమంది ప్రజలు చేరుకున్నారు. కాగా.. ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌ పేరిట మంగళవారం నాడు బ్యాంకులకు వర్కింగ్‌ హాలీడే ప్రకటించారు. దీంతో మంగళవారం బ్యాంకు తెరవకపోవడంతో చాలామంది గంటల తరబడి నిరీక్షించి.. నిరాశతో వెనుదిరిగారు. అలాగే ‘ఆధార్‌’లో సమాచారం, పాఠశాలలో నమోదు చేసిన సమాచారం ఒకేలా ఉండాలన్న నిబంధనతో విద్యార్థులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. పోస్టల్‌ కార్యాలయాలు, ఇతర నెట్‌ సెంటర్ల వద్ద కూడా ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలు బారులుతీరుతున్నారు. సోంపేట పోస్టాఫీసులోని ఆధార్‌ సెంటర్‌ వద్ద మంగళవారం ప్రజలు ఎండలోనే క్యూ కట్టి అవస్థలు పడ్డారు. గంటల తరబడి నీరిక్షించినా సాంకేతిక సమస్యల కారణంగా ‘ఆధార్‌’లో వివరాలు అప్‌డేట్‌ కాక అసహనం చెందారు. తమ కష్టాలను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:55 PM