Pond : ఆ కాలనీవాసుల్లో ఆనందం
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:16 AM
colony residents ప్రజా సమస్యల పరిష్కారానికి.. ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం వేదికగా మారింది. శ్రీకాకుళంలోని 31వ డివిజన్‌లో ఈ ఏడాది జనవరి 28న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించింది.

31వ డివిజన్ చెరువులో పిచ్చిమొక్కలు.. అసాంఘిక కార్యకలాపాలు
ఏళ్లతరబడి పరిష్కారం కాని సమస్య
కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్
రామ్మోహన్‌నాయుడు చొరవతో అభివృద్ధి పనులు
కలుపు మొక్కలు తొలగించిన నగరపాలక అధికారులు, సిబ్బంది
‘ఆంధ్రజ్యోతి’కి సాయినగర్ కాలనీవాసుల కృతజ్ఞతలు
శ్రీకాకుళం అర్బన్, మార్చి 27(ఆంధ్రజ్యోతి):
ఈ కార్యక్రమంలో సాయినగర్ కాలనీవాసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న చెరువు సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. కలుపు మొక్కలతో చెరువు అధ్వానంగా ఉందని, పాములు, పందుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. చెరువు సమీపంలో గంజాయి బాబుల వికృత చేష్టలతో నివసించలేకపోతున్నామని వివరించారు. సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ ఆ చెరువును పరిశీలించారు. సుందరీకరణ పనులు చేపడతామని నాడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ నెల 14న ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా చెరువు చుట్టూ ఉన్న పొదలు, తుమ్మచెట్లను నగరపాలక సిబ్బంది తొలగించారు. అలాగే బుధవారం చెరువులో కలుపు మొక్కలను తీసేశారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీ ప్రసాదరావు ఆదేశాల మేరకు హెల్త్‌ఆఫీసర్ డా.సుధీర్‌కుమార్ పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. నాడు అధ్వానంగా ఉన్న చెరువులో.. నేడు కొద్దిపాటి జలం కనిపించడంతో.. సాయినగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25ఏళ్ల సమస్యకు మోక్షం లభించిందంటూ ‘ఆంధ్రజ్యోతి’కి ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
నగరాభివృద్ధే లక్ష్యం
శ్రీకాకుళం నగరం అభివృద్ధే లక్ష్యం. సామాజిక భాధ్యతతో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి.. వాటి పరిష్కారానికి భాగస్వామ్యులైన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక అభినందనలు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవతో సాయినగర్ కాలనీ చెరువు సుందరీకరణ పనులు చేపట్టాం. త్వరలోనే రోడ్డు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తాం.
- పీవీవీ ప్రసాదరావు, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్
‘ఆంధ్రజ్యోతి’కి రుణపడి ఉంటాం
25 ఏళ్లుగా కాలనీలో ఉంటున్నా. చెరువు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా కేంద్రమంత్రికి మా సమస్య విన్నవించాం. చెరువు సుందరీకరణ చేసి.. మళ్లీ అందుబాటులోకి తెచ్చినందుకు ‘ఆంధ్రజ్యోతి’కి రుణపడి ఉంటాం. కేంద్రమంత్రికి, ఎమ్మెల్యేకు, కమిషనర్‌కు కృతజ్ఞతలు.
- బసవ శ్రీనివాసరావు, సాయినగర్ కాలనీ
పాములతో హడలెత్తిపోయాం
చెరువులో కలుపుమొక్కలు పెరిగిపోవడంతో.. పెద్ద పెద్ద పాములు ఇళ్లలోకి వచ్చేసేవి. వాటిని చూసి హడలెత్తిపోయేవాళ్లం. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యకు పరిష్కారం లభించడం ఆనందంగా ఉంది.
- పెద్దిరెడ్డి రమేష్, సాయినగర్ కాలనీ
అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయి
ఆరేళ్లుగా సాయినగర్ కాలనీలో నివసిస్తున్నాం. చెరువు చుట్లూ తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలు మొలవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. చీకటి పడితే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడేవాళ్లం. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో చెరువు ను శుభ్రం చేసి తుమ్మచెట్లు తొలగించడంతో అసాంఘిక శక్తుల పీడ విరగడైంది.
- పనుకు జయమ్మ, సాయినగర్ కాలనీ
అడవిని తలపించేది
కాలనీలో పదేళ్లుగా నివసిస్తున్నాం. చెరువు చుట్టూ విష జంతువులు, మొక్కలతో అడవిని తలపించేది. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం ప్రతీరోజూ పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించడంతో.. గంజాయిబాబుల హడావుడి తగ్గింది.
- పుళ్ళట రవికుమార్, సాయినగర్ కాలనీ
ప్రజాగళం.. ‘ఆంధ్రజ్యోతి’ నినాదం
సమస్యలు పరిష్కరించడంలో ‘ఆంధ్రజ్యోతి’.. ప్రజాగళాన్ని విప్పి పోరాడుతోంది. జనవరిలో చెరువు సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు చెరువు సుందరీకరణ పనులు చేపట్టడంలో ‘ఆంధ్రజ్యోతి’ కీలకపాత్ర పోషించింది. చెరువు పనులు పూర్తి కావడానికి కృషి చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి అభినందనలు.
- విభూది సూరిబాబు, 31వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి