Ramadan: నేడు రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:47 AM
Ramadan:నెలరోజుల రంజాన్ ఉపవాస దీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. రంజాన్ కోసం జిల్లాలోని అన్ని మసీదులు సిద్ధమయ్యాయి.

- ప్రార్థనలకు సిద్ధమైన మసీదులు
నరసన్నపేట, మార్చి30 (ఆంధ్రజ్యోతి): నెలరోజుల రంజాన్ ఉపవాస దీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. రంజాన్ కోసం జిల్లాలోని అన్ని మసీదులు సిద్ధమయ్యాయి. ఈ నెల 28 నుంచే రంజాన్ పర్వదినం కోసం మసీదుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పలాస తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ప్రార్థనలు చేయనున్నారు. రంజాన్ మాసం నెల వంకతో ప్రారంభమై నెలవంక కనిపించగానే ముగుస్తుంది. ఉపవాస దీక్షల అనంతరం నెల వంక కనిపించగానే మరుసటి రోజు రంజాన్ పండుగ నిర్వహిస్తారు. దీనికోసం మసీదులను ముస్తాబు చేశారు. వాటికి రంగు, రంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. ఆయా మసీదుల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక నమాజ్‌లు జరగనున్నాయి. ముస్లింలు తక్బీర్ చదువుతారు. అనంతరం ఇమామ్‌లు ప్రత్యేక సందేశం ఇస్తారు. మసీదులు వద్ద ఒకరికొకరు ఈద్‌ముబారక్ చెప్పుకుంటారు. రంజాన్ పర్వదినం నాడు ముస్లిం కుటుంబాల ఇళ్లలో చేసుకునే షీర్ ఖుర్మా ప్రత్యేక రంజాన్ వంటకంగా ప్రసిద్ధ చెందింది. శ్రేష్టమైన సేమ్యాను తీసుకుని నేతిలో వేయిస్తారు. అనంరతం సమ పాళ్లలో పాలు, చక్కర కలిపి వండుతారు. దానిలో జీడిపప్పు, ద్రాక్ష, బాదంపప్పు, యాలుకలు, నెయ్యి, గసగసాలు, తదితర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ప్రత్యేకంగా తయారు చేసే ఈ షీర్ ఖుర్మాను మసీదులకు వెళ్లేటప్పుడు అల్లాహారంగా స్వీకరిస్తారు. మసీదులు నుండి రాగానే బిర్యానీలు వండి ఇరుగు పొరుగుకు పంచుకుంటూ రంజాన్ వేడుకులు అనందంగా గడుపుతారు.