Ugadi: తెలుగుదనం ఉట్టిపడేలా..
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:43 AM
Ugadi: విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆదివారం జిల్లా వాసులు ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. రైతన్నలు ఏరువాకను నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుట్టారు.

జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు
ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు
ఏరువాక చేపట్టిన రైతన్నలు
విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆదివారం జిల్లా వాసులు ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. రైతన్నలు ఏరువాకను నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుట్టారు. పాడిపంటలు బాగా పండాలని పూజలు చేశారు. దేవాలయాలు, గ్రామ చావిడిల వద్ద పురోహితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలో వర్షాలు, వాతావరణ పరిస్థితులతో పాటు రాశి ఫలాలను వివరించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చాలామంది కొత్త వాహనాలు, బంగారం, గృహోపకరణాలు, నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే రూ.100కోట్లకుపైగా వ్యాపారం సాగింది.
శ్రీకాకుళం కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళావేదికలో ఆదివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ఉగాది వేడుకలను ప్రారంభించారు. దైవజ్ఞ ధర్మపురి గౌరీశంకర శాస్త్రి పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరంలో అంతామంచి జరుగుతుందని అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ప్రజల ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండేదని, ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉందని చెప్పారు. రైతులకు ఆనందకరమైన సంవత్సరం అన్నారు. ఈ సంవత్సరం రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయన్నారు. ఆదాయ, వ్యయం, రాజపూజ్యం, అవమానం తదితర వివరాలను రాశుల వారీగా వివరించారు. అనంతరం ధర్మపురి గౌరీశంకర శాస్త్రితో పాటు దేవదాయ శాఖ ఎంపిక చేసిన అర్చకులను కలెక్టర్ సత్కరించారు. కవులు కేవీ రాజారావు, బొంతు సూర్యనారాయణ, పొట్నూరు సుబ్రహ్మణ్యం, ఈవేమన, ఉప కలెక్టర్ సవరమ్మ, మండా శ్రీనివాసరావు, ఆరవెల్లి అనంతరామం, దామోదరాచారి, రమణమూర్తి, రావలి నాగేశ్వరరావు, బోగెల ఉమామహేశ్వరరావు, పూడి జనార్దనరావులు కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితలు వినిపించారు. అనంతరం వీరిని సన్మానించారు. అందరూ ఉగాది పచ్చడిని ఆరగించారు.
ప్రజల భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధి: కలెక్టర్
జిల్లాలోని ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో వర్దిల్లాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. పీ4 సర్వే కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన అమరావతిలో ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లాలో చేపట్టనున్న పీ4 సర్వేతో బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమ ఫలాలు, ప్రజల జీవితానికి సంతోషాల తోరణాలు అని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ రోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో జీవితాంతం అంతే సంతోషం లభించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, కేఆర్‌పీ ఉప కలెక్టర్ లక్ష్మణరావు, సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు విశ్వమోహన్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డీపీవో భారతీ సౌజన్య, డీఈవో తిరుమల చైతన్య, జిల్లా ఉద్యాన అధికారి ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి, డీఎస్‌వో సూర్య ప్రకాష్, జడ్పీ సీఈవో కుమార్ రాజ్, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట బీసీ బాలికల వసతిగృహంలో ఉగాది వేడుకలు
అందరికీ సిరిసంపదలు కలగాలి: మంత్రి అచ్చెంనాయుడు
కోటబొమ్మాళి: మార్చి30(ఆంధ్రజ్యోతి): తెలుగువారికి ఉగాది నుంచే కొత్తదనం ప్రారంభమవుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తన స్వగ్రామం నిమ్మాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు మంత్రికి ఉగాది పచ్చడి, మిఠాయిలు తినిపించారు. అనంతరం ఆయన కార్యకర్తల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈకొత్త సంవత్సరం నుంచి అన్నివర్గాల ప్రజలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. గ్రామాలకు అవసరమయ్యే నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. జూన్ 26న స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.