Inter: ఇంటర్ కొత్త సిలబస్
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:00 AM
Intermediate syllabus ఇంటర్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలుకు కసరత్తు ముమ్మరం చేసింది. నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా సిలబస్‌లో మార్పులు చేసింది.

నీట్, జేఈఈ పరీక్షలకు అనుకూలంగా మార్పు
గణితం, బయాలజీలో ఒక్కొక్క పేపర్
ప్రశ్నపత్రం నమూనా విడుదల
ఈ ఏడాది నుంచి అమలుకు సన్నాహాలు
నరసన్నపేట, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలుకు కసరత్తు ముమ్మరం చేసింది. నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా సిలబస్‌లో మార్పులు చేసింది. ఈమేరకు 2025-26 విద్యాసంవత్సరం చెందిన సిలబస్, ప్రశ్నపత్రాల కూర్పు, అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృత్తికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అకాడమిక్ సంవత్సరంలో 314 రోజులకు గాను 235 రోజులు పనిదినాలు 79 దినాలు సెలవులుగా పరిగణిస్తూ షెడ్యూల్ విడుదల చేశారు.
ఏప్రిల్ 24 నుంచి- జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు. జూన్ 2న కళాశాలలు తెరవనున్నారు. జూలై 17 నుంచి 19 వరకు యూనిట్ -1 పరీక్షలు, ఆగస్టు 18 నుంచి 20 వరకు యూనిట్-2, సెప్టెంబరు 15 నుంచి 20 వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేశారు.
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు దసరా సెలవులు. అక్టోబరు 22 నుంచి 24 వరకు యూనిట్ -3 పరీక్షలు, నవంబరు 17 నుంచి 22 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, జనవరి 15 నుంచి 20వరకు ప్రీఫైనల్-1 పరీక్షలు నిర్వహిస్తారు.
జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు. జనవరి 21 నుంచి 28 వరకు ప్రీఫైనల్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి-మార్చిలో థియరీ పరీక్షలు నిర్వహించి.. మార్చి 18న ఇంటర్ అకాడమిక్ ఇయర్ ముగుస్తుంది.
సిలబస్ ఇలా..
గతంలో గణితం-ఏ, బీ రెండు పేపర్లు ఉండగా.. ఈఏడాది నుంచి ఒకే పేపర్‌గా మార్పు చేశారు. మొత్తం 14 యూనిట్లుగా విభజించారు. ఫిజిక్స్‌లో 14 యూనిట్లు, కెమిస్ట్రీలో 9 యూనిట్లు సిలబస్ పొందుపరిచారు. ఇక బోటనీ, జువాలజీలను కలిపి బయాలజీగా మొత్తంగా ఏడు యూనిట్లు, 19 చాప్టర్లను రూపొందించారు. ఇందులో బోటనీ నాలుగు యూనిట్స్‌లో 10 చాప్టర్లు, జువాలజీలో 3 యూనిట్లు 9 చాప్టర్లు ఉంటాయి. సివిక్స్‌లో 12 చాప్టర్లు, హిస్టరీ 12 చాప్టర్లు, ఎకానమిక్స్ 9 చాప్టర్లు, కామర్స్‌లో థియరీలో మూడు యూనిట్లు, అకౌంటింగ్‌లో 5యూనిట్లు ఉన్నాయి. అలాగే కొత్తగా తెలుగు, ఇంగ్లిషు, సంస్కృతం , హిందీ తదితర సబ్జెక్టుల సిలబస్‌ను విడుదల చేశారు.
ప్రశ్నల కూర్పులో మార్పు
ఈ ఏడాది నుంచి ప్రశ్నపత్రాల కూర్పులో మార్పు చేశారు. గణితంలో ఒక మార్కు ప్రశ్నలు 12, రెండు మార్కులు ప్రశ్నలు 10, నాలుగు మార్కులు ప్రశ్నలు ఏడు, 8 మార్కులు ప్రశ్నలు 5 రాయాల్సి ఉంటుంది. నాలుగు, 8 మార్కులు ప్రశ్నలకు చాయిస్ ఇచ్చారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక మార్కు ప్రశ్నలు తొమ్మిది, రెండు మార్కుల ప్రశ్నలు 14, నాలుగు మార్కుల ప్రశ్నలు ఎనిమిది, ఎనిమిది మార్కులు ప్రశ్నలు రెండు రాయాలి. ఇక్కడ కూడా నాలుగు, 8 మార్కు ప్రశ్నలకు మాత్రమే చాయిస్ ఇచ్చారు.
బయాలజీలో బోటనీకు 43 మార్కులు, జువాలజీకు 42 మార్కులు కేటాయించారు. ఒక మార్కు ప్రశ్నలు 9, రెండు మార్కులు ప్రశ్నలు 14, నాలుగు మార్కులు ప్రశ్నలు 4, ఎనిమిది మార్కుల ప్రశ్నలు రెండు కేటాయించారు. అలాగే హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్‌కు ఒక మార్కు ప్రశ్నలు 10, రెండు మార్కు ప్రశ్నలు 20 ఇస్తారు 15 ప్రశ్నలు రాయాలి. నాలుగు మార్కుల ప్రశ్నలు 14 ఇస్తారు 9 రాయాలి. ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఐదు ఇస్తారు.. మూడు రాయాల్సి ఉంటుంది.
కామర్స్‌లో ఒక మార్కు ప్రశ్నలు 8, రెండు మార్కుల ప్రశ్నలు 20 ఇస్తారు.. 14 రాయాలి. నాలుగు మార్కులు ప్రశ్నలు పది ఇస్తారు.. నాలుగు రాయాల్సి ఉంటుంది. ఏనిమిది మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు మూడు రాయాలి. 16 మార్కులకు అకౌంటింగ్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. దీనికి చాయిస్ లేదు. ఇంగ్లిషులో అర మార్కు, ఒక మార్కు, రెండు మార్కు, ఐదు మార్కులు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు, గ్లామర్, బిట్స్ ఇస్తారు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఊర్దూ ప్రశ్నపత్రాలు కూర్పు చేయాల్సి ఉంది.