Share News

IPL Betting: పందెం కాస్తే.. పోతాయ్‌!

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:51 PM

Impact of betting on lives క్రికెట్‌ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) శనివారం ప్రారంభమైంది. రెండు నెలలకుపైగా సాగే ఈ సంగ్రామాన్ని కొందరు వినోదం కోసం చూస్తుంటారు. మరికొందరు సులభంగా ఆదాయం సంపాదించే వనరుగా భావిస్తున్నారు. బంతి బంతికీ బెట్టింగ్‌ పెట్టి డబ్బు సంపాదించాలని అత్యాశ పడుతున్నారు.

IPL Betting: పందెం కాస్తే.. పోతాయ్‌!

  • క్రికెట్‌ బెట్టింగ్‌ వలలో యువత

  • ఆన్‌లైన్‌ యాప్‌లతోనూ నష్టపోతున్న వైనం

  • జిల్లాలో ఎంతోమంది బాధితులు

  • కొన్ని ఘటనలే పోలీసుస్టేషన్‌ వరకు..

  • ఇంకా వెలుగులోని రాని కేసులెన్నో

  • అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు

  • హరిపురం/ కవిటి, మార్చి 22(ఆంధ్రజ్యోతి):

  • - సోంపేట మండలానికి చెందిన ఒక యువకుడు మందస మండలంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ యువకుడు బెట్టింగ్‌లకు అలవాటు పడి జీతం డబ్బులు పోగొట్టుకున్నాడు. స్నేహితుల నుంచి, ఆన్‌లైన్‌ యాప్‌ల్లో రూ.లక్షల్లో అప్పులు తీసుకొని మరీ బెట్టింగ్‌ల్లో పెట్టాడు. చివరకు అప్పుల బాధ తట్టుకోలేక కొన్నాళ్ల కిందట పరారీ అయ్యాడు. కుటుంబ సభ్యులు భూమి అమ్మి ఆ అప్పును తీర్చుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

    ....................

  • - పలాస ప్రాంతానికి చెందిన డిగ్రీ చదువుతున్న యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగులు, క్రికెట్‌ గేమ్స్‌, పందేలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు యాప్‌ల ద్వారా లోన్‌లు తీసుకుని మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోవడంతో.. ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని తనలా ఎవరూ బెట్టింగ్‌లకు బానిస కావద్దని, తనను క్షమించాలని తల్లిదండ్రులను వేడుకున్నాడు.

    .......................

  • - పలాస, మందస మండలాల మధ్య ఓ రెస్టారెంట్‌ నిర్వాహకుడు గత ఐపీఎల్‌లో రూ.లక్షల్లో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు. ఐదేళ్లపాటు కష్టపడి కూడబెట్టిన డబ్బు మొత్తం బెట్టింగుల్లో పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. రెస్టారెంట్‌ అమ్మినా అప్పులు తీరకపోవటంతో భూమి, విలువైన సామగ్రి కూడా విక్రయించాడు. భార్య, పిల్లలను వదిలి పరారయ్యాడు. దీంతో గత్యంతరం లేక భార్య, పిల్లలు మరో రెస్టారెంంట్‌లో కూలీలుగా మారారు.

    .......................

  • కవిటికి చెందిన ఓ యువకుడు.. ఓ వ్యాపారి వద్ద గుమస్తాగా చేరాడు. నమ్మకంగా ఉండడంతో ఆ వ్యాపారి బ్యాంకు లావాదేవీలు అప్పగించాడు. అదే అదునుగా ఆ యువకుడు కొంతమొత్తాన్ని ఆన్‌లైన్‌ యాప్‌ బెట్టింగ్‌ల్లో పెట్టి నష్టపోయాడు. బ్యాంకు లావాదేవీల్లో తేడాలు వచ్చినట్టు వ్యాపారి గుర్తించి.. ఆ యువకుడిని నిలదీశాడు. దీంతో కుటుంబ సభ్యులు కొంత స్థలాన్ని అమ్మి.. ఆ వ్యాపారికి అప్పు తీర్చారు.

    .................

  • కవిటి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టి కొన్నిరోజుల వరకు బాగానే లాభాలు సంపాదించాడు. చుట్టుపక్కల వారి నుంచి కూడా సొమ్ము సేకరించి.. స్థానికంగా ఓ కంప్యూటర్‌ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌ పెట్టుబడుల కథ నడిపాడు. చివరకు లాభాలు లేకపోగా.. నష్టం ఎదురవడంతో అప్పులపాలై బాధితులంతా లబోదిబోమంటున్నారు.

    .....................

  • క్రికెట్‌ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) శనివారం ప్రారంభమైంది. రెండు నెలలకుపైగా సాగే ఈ సంగ్రామాన్ని కొందరు వినోదం కోసం చూస్తుంటారు. మరికొందరు సులభంగా ఆదాయం సంపాదించే వనరుగా భావిస్తున్నారు. బంతి బంతికీ బెట్టింగ్‌ పెట్టి డబ్బు సంపాదించాలని అత్యాశ పడుతున్నారు. ఈ ఊబిలో చిక్కుకొని చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా యువతే ఇందులో బాధితులుగా మారుతున్నారు. గతంలో ఐపీఎల్‌ క్రికెట్‌ క్రీడలకు సంబంధించి పట్టణాల్లోనే సాగే బెట్టింగ్‌లు.. నేడు సెల్‌ఫోన్‌ పుణ్యమా అని పల్లెలకూ పాకింది. కొన్నేళ్ల కిందట అందరూ ఓ చోట కూర్చుని పందేలు కాసేవారు. తర్వాత కాలంలో పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు జరిగేటప్పుడు బుకీల పేర్లు వినిపించేవి. ప్రస్తుతం చాలావరకు ఆన్‌లైన్‌లోనే ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. యువత పలు యాప్‌ల్లో పందేలు కాస్తూ అప్పుల వలయంలో చిక్కుకుంటున్నారు. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

  • అధిక మొత్తానికి ఆశపడి..

  • జిల్లాలో కొంతమంది యువకులు బెట్టింగ్‌ యాప్‌ల మాయలో పడి.. కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నారు. తక్కువ పెట్టుబడికి అధిక మొత్తం వస్తుందని ఆశ పడి ఆన్‌లైన్‌లోని యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రారంభంలో రూపాయికి రూపాయి లాభం రావడంతో.. క్రమేపీ అధికమొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. ఆన్‌లైన్‌లోనే నగదు బదిలీ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత నష్టాలు ఎదుర్కొని.. తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. పెట్టుబడి సొమ్ము పోవడమే కాకుండా, బకాయి ఉన్నట్టు యాప్‌ల బుకీల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈక్రమంలో పరువు పోయిందనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. యువత ఈజీమనీకి అలవాటు పడటంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ వ్యవహారంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • నిందితులపై కన్నేస్తే...

  • బెట్టింగ్‌ కేసుల్లో అరెస్టయిన నిందితులపై పోలీసులు ఓ కన్నేస్తే కొంతవరకైనా వీటికి అడ్డుకట్ట పడుతుంది. మధ్యవర్తులుగా వ్యవహరించే బుకీల కార్యకలాపాలపైనా దృష్టి సారించాలి. లోతుగా విచారిస్తే సూత్రధారులెవరో స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైన పక్షంలో యాప్‌ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగులను ప్రోత్సహిస్తున్న సామాజిక మాధ్యమాల ప్రభావశీలురపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోనూ కఠినంగా వ్యవహరించాలి.

  • పందేల జోలికెళ్లొద్దు

  • ఐపీఎల్‌ పోటీలు వినోదాత్మకంగా సాగాలి తప్ప.. పందేలు జోలికి పోకూడదు. బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండాలి. ఒక్కసారి ఆ ఊబిలో దిగితే చాలు.. పైకిరావటం కష్టం. ఇలాంటి యాప్‌లు, పందేలు కాస్తే కఠినచర్యలు తప్పవు. యువత మరింత జాగురకతతో వ్యవహరించాలి.

    - వెంకటప్పారావు, డీఎస్పీ, కాశీబుగ్గ

Updated Date - Mar 22 , 2025 | 11:51 PM

News Hub