Rain: గాలీవాన బీభత్సం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:05 AM
Thunderstorms జిల్లాలో అకాల వర్షం దంచిగొట్టింది. సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో ఈదురుగాలులు బలంగా వీచాయి. వడగళ్ల వర్షం తోడై... బీభత్సం సృష్టించాయి.

నేలకొరిగిన భారీ వృక్షాలు
తెగిపడిన విద్యుత్ తీగలు
రాలిన మామిడి పిందెలు
ఆందోళనలో రైతులు
శ్రీకాకుళం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అకాల వర్షం దంచిగొట్టింది. సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో ఈదురుగాలులు బలంగా వీచాయి. వడగళ్ల వర్షం తోడై... బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం, కొత్తూరు, హిరమండలం, పొందూరు మండలాల్లో మామిడి, మొక్కజొన్న, అరటి, వరిపంటకు తీవ్ర నష్టం కలిగింది. శ్రీకాకుళంలో అత్యధికంగా 37.25 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇక నగరంలో మురుగునీరు.. వర్షపునీరు కలిసి రోడ్లపై ప్రవహించాయి. శ్రీకాకుళం, గార ప్రాంతాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెస్స్‌లో పార్శెల్ సర్వీస్ విభాగంలో విద్యుత్ అంతరాయంతో సాయంత్రం వరకు సేవలు నిలిచాయి. నగరంతోపాటు.. చుట్టుపక్కల ఉన్న భారీ వృక్షాలు.. వాటి కొమ్మలు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి వాటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే చాలాచోట్ల మామిడి పూత, పిందెలు రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం జిల్లాలో కురిసిన వర్షపాతం (మిల్లీమీటర్లలో)
-----------------
శ్రీకాకుళం 37.25
కొత్తూరు 30.25
హిరమండలం 28.75
శ్రీకాకుళం రూరల్ 28.0
పొందూరు 23.75
ఆమదాలవలస 15.5
పాతపట్నం 13.75
బూర్జ 8.5
రణస్థలం 7.75
ఎల్.ఎన్.పేట 5.25