Appsc: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:08 AM
Examination Schedule ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాల’ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

నేటి నుంచి మూడురోజులపాటు నిర్వహణ
హాజరుకానున్న 1,304 మంది అభ్యర్థులు
డీఆర్వో వేంకటేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాల’ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ‘పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏఈఈ, అలాగే ఎనలిస్ట్ గ్రేడ్-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించి మూడు కేంద్రాలను సిద్ధం చేశాం. శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజీ, నరసన్నపేట కోర్ టెక్నాలజీ కాలేజీ, శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తాం. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 25న 545 మంది, 26న 457 మంది, 27న 302 మంది మొత్తం 1,304 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలి. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుడా చర్యలు చేపట్టాల’ని ఆదేశించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ వివేకానంద, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఈశ్వరి, పద్మప్రియ, డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.