Sugarcane: చెరకు రైతుకు అన్నీ కష్టాలే!
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:18 AM
Sugarcane Farmers' Struggles అందరికీ తీపి తినిపించే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుతోంది. పెట్టుబడి వ్యయం పెరగడం.. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

ఏటా తగ్గుతున్న సాగు విస్తీరం
ఒకప్పడు వేల ఎకరాల్లో.. ఇప్పుడు వందల్లో..
గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న వైనం
గత ఐదేళ్లూ అందని ప్రోత్సాహం
మెళియాపుట్టి మండలం గొడ్డ గ్రామానికి చెందిన చందక దాలినాయుడు 15 ఏళ్లుగా సుమారు 10 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాడు. ప్రస్తుతం కూలీలు లేక.. పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వం రైతులు రాయితీలు సైతం ఇవ్వకపోవడంతో ఈ ఏడాది రెండు ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నాడు. బెల్లం కిలో మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.60 ఉండగా, వ్యాపారులు మాత్రం రూ.30 నుంచి రూ.40లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టపోయి.. పంటపై ఆసక్తి తగ్గుతోందని దాలినాయుడు వాపోతున్నాడు.
.......................
ఎచ్చెర్ల/ మెళియాపుట్టి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): అందరికీ తీపి తినిపించే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుతోంది. పెట్టుబడి వ్యయం పెరగడం.. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఒకప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా చెరకు సాగు చేసేవారు. ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, పోలాకి, నరనసన్నపేట, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో చెరకు పండించేవారు. ఆమదాలవలసలో చక్కెర కర్మాగారానికి ఆ చెరకును తరలించేవారు. కాగా.. ఈ కర్మాగారం మూతపడిన తర్వాత జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం రాయితీలు కూడా ప్రకటించకపోవడంతో చెరకు సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. అలాగే జిల్లాలో చక్కెర కర్మాగారం లేకపోవడంతో.. విజయనగరం జిల్లాలోని సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి చెరకును పంపిస్తున్నారు. రవాణాకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెల్లం తయారీ కంటే యాత్రలు, ఆలయాల వద్ద చెరకు గెడలు విక్రయిస్తేనే తమకు లాభం వస్తోందని కొంతమంది రైతులు పేర్కొంటున్నారు.
సాగు ఇలా:
జిల్లాలో చెరకు సాగు ఏటా తగ్గుతోంది. గత వైసీపీ ప్రభుత్వం చెరకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దీంతో గత ఐదేళ్ల నుంచి చెరకు సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. 2021-22లో ఖరీఫ్‌లో 1,257 హెక్టార్లు, రబీలో 807 హెక్టార్లలో రైతులు చెరకు సాగు చేశారని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 2022-23లో ఖరీఫ్‌లో 1,033 హెక్టార్లు, రబీలో 146 హెక్టార్లలో చెరకు పండించారు. 2023-24లో ఖరీఫ్‌లో 688 హెక్టార్లు, రబీలో 62 హెక్టార్లలో మాత్రమే చెరకు సాగు చేశారు. 2024-25లో ఖరీప్‌లో 679 హెక్టార్లలో చెరకు పండించారు. ప్రస్తుత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పైపులతోపాటు బెల్లం ధరకు గిట్టుబాటు కల్పిస్తామని ప్రకటించడంతో రబీలో 102 హెక్టార్లలో చెరకు పంట వేశారని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
గిట్టుబాటుకాని ధర
చెరకు క్వింటాల్‌కు రూ.290, టన్నుకు రూ.2,900 చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే టన్నుకు కేవలం రూ.90 మాత్రమే పెరిగింది. ఎకరా చెరకు సాగుకు రూ.20వేలకు మించి ఖర్చు చేసినా 30 టన్నులకు మించి దిగుబడి రావడంలేదని వాపోతున్నారు. చెరకు కటింగ్, రవాణాకు టన్నుకు మరో రూ.3వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఎకరాకు 50టన్నుల వరకు దిగుబడి వస్తే తప్ప.. ప్రస్తుత రేట్లలో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర పెంచాలని కోరుతున్నారు.
చెరకు రసానికి డిమాండ్
చెరకు బెల్లం తయారీ కన్నా.. రసానికే డిమాండ్ ఎక్కువగా ఉంది. స్థానికులతోపాటు బీహార్, రాజస్థాన్‌కు చెందినవారు జిల్లాలోని పలుచోట్ల యంత్రాలతో చెరకు నుంచి రసాన్ని తీసి.. ఒక్కో గ్లాస్ రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. వారు నేరుగా రైతులకు వద్దకు వెళ్లి చెరకును కొనుగోలు చేసి.. నిల్వ ఉంచుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
చెరకు రైతులు పండించాలంటే.. బెల్లానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. ఒకప్పుడు 8 ఎకరాల్లో చెరకు పండించేవాడిని. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం చెరకు రైతులను పట్టించుకోలేదు. దీంతో నష్టాలు ఎదుర్కొని చెరకు సాగు వదిలేశాను. ప్రస్తుత ప్రభుత్వమైనా మద్దతు ధర పెంచుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది 5 ఎకరాల్లో చెరకు సాగు చేపడుతున్నాను. బెల్లం తయారీ కంటే.. అధికంగా రసం తయారుచేసే వ్యాపారులు చెరకు గెడలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- కోట తిరుపతిరావు, రైతు, గొప్పిలి, మెళియాపుట్టి
..................
చెరకు పండిస్తే మంచిదే
చెరకు పంటకు ప్రస్తుతం మంచి డిమాండ్ కనిపిస్తోంది. చెరకు రసం వినియోగం పెరిగింది. బెల్లానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగుకు అవసరమైన పైపులను రాయితీపై అందజేయనుంది. ఈ విధానం ద్వారా పెట్టుబడి తగ్గి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
- దుక్క శరత్‌రెడ్డి, ఉద్యానవన శాఖాధికారి, మెళియాపుట్టి