Water palnt: శుద్ధ జలాలను చిదిమేశారు!
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:12 AM
Water Supply Disruption ఉద్దానం గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చేతి పంపులు పనిచేయడం లేదు. కుళాయిల ద్వారా నీరందడం లేదు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి అతీగతీ లేదు.

మూతపడిన వాటర్ ప్లాంట్లు
‘ఉద్దానం’లో ప్రమాద ఘంటికలు
గత ఐదేళ్లుగా కొనసాగిన నిర్లక్ష్యం
ఇచ్ఛాపురం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఉద్దానం గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చేతి పంపులు పనిచేయడం లేదు. కుళాయిల ద్వారా నీరందడం లేదు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి అతీగతీ లేదు. అప్పట్లో ఉద్దానానికి శుద్ధ జల ప్లాంట్లు అండగా నిలిచేవి. రూ.2కే 20 లీటర్ల నీరు అందేది. రూ.10 పెడితే కుటుంబ తాగునీటి అవసరాలకు రోజుకు 100 లీటర్ల నీరందేది. కానీ గత వైసీపీ పాలనలో ఈ శుద్ధ జలాల ప్లాంట్లు మూతపడ్డాయి. కొద్దిపాటి ప్లాంట్లే పని చేస్తున్నాయి. 20 లీటర్ల క్యాన్‌ను రూ.7కు పెంచినా.. సరిపడా నీరందని దుస్థితి నెలకొంది. గత ఐదేళ్లూ కేవలం హిరమండలం నుంచి తెచ్చిన ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం పేరు చెప్పి.. శుద్ధ జల ప్లాంట్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఈ ప్రాంతప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో..
తాగునీరు కలుషితమే ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తికి ఒక కారణమని అధ్యయనాలు తేల్చాయి. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఎన్టీఆర్ సుజలధార పేరుతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. రూ.14కోట్ల వ్యయంతో శుద్ధ జలాల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురంలో మండలానికి ఒకటి చొప్పున మదర్‌ప్లాంట్లను నెలకొల్పారు. ఏడు మండలాల్లోని 135 గ్రామాల్లో సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్ ప్లాంట్ల నుంచి సరఫరా కేంద్రాలకు శుద్ధ జలాలను తరలించేందుకు స్టీల్ కంటైనర్లతో ట్రాక్టర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. 20 లీటర్ల నీటిని రూ.2కే అందించేవారు. కొన్నాళ్లపాటు ఇవి బాగానే పనిచేశాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో సగానికిపైగా సరఫరా కేంద్రాలు మూతపడ్డాయి. ట్రాక్టర్లు సైతం తరచూ మొరాయిస్తున్నాయి. శుద్ధ జలాల తరలింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి కావడంతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. బోర్లు, బావుల నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు.
హడావుడిగా శంకుస్థాపన
2023 డిసెంబరులో అప్పటి సీఎం జగన్ కంచిలి మండలంలో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ ఈ పథకం పనులు కొలిక్కి రాలేదు. చాలా గ్రామాలకు ఇంతవరకూ పైపులైన్లు వేయలేదు. ఆ పథకం అందుబాటులోకి వచ్చింది కదా అని ఎన్టీఆర్ సుజలధార పథకాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం అందుబాటులోకి వచ్చేసరికి దాదాపు ఏడాది పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 20 లీటర్ల క్యాన్ ధర రూ.2 ఉండగా.. నిర్వహణ వ్యయం పేరిట వైసీపీ సర్కారు దానిని రూ.7కు పెంచింది. ప్రజలపై అదనపు భారం మోపింది. ధర పెంచినా వాటి నిర్వహణలో మాత్రం వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఉద్దానం ప్రజలకు శాపంగా మారింది.
నిర్వీర్యం చేశారు
ఉద్దానంలో ఎన్టీఆర్ సుజలధార శుద్ధ జలాల ప్లాంట్ల సేవలు విస్తృతంగా అందించేవి. కానీ వైసీపీ పాలనలో నిర్వహణ లేకపోవడంతో.. నిర్వీర్యమయ్యాయి. క్యాన్ ధర పెంచినా నీరందని పరిస్థితి నెలకొంది.
- కాళ్ల దిలీప్, 22వ వార్డు టీడీపీ కౌన్సిలర్, ఇచ్ఛాపురం
........................
మూడు మాత్రమే..
కంచిలి మండలంలో 19 శుద్ధజలాల ప్లాంట్లు ఉండగా మఖరాంపురం, కత్తివరం, శ్రీరాంపురం గ్రామాల్లో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలినవన్నీ మూలకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శుద్ధ జలాల ప్లాంట్లు వినియోగంలోకి తీసుకురావాలి..
- మాదిన రామారావు, టీడీపీ మండల కార్యదర్శి, కంచిలి
..............................
బాగు చేస్తున్నాం
శుద్ధ జలాల ప్లాంట్లను బాగు చేస్తున్నాం. వీలైనంత వేగంగా పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం మండలంలో 11కిగానూ 5 శుద్ధజలాల ప్లాంట్లు పనిచేస్తున్నాయి.
- కె. విష్ణుమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, ఇచ్ఛాపురం