Share News

Danish tourists clean sikkim roads: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!

ABN , Publish Date - Mar 20 , 2025 | 07:36 AM

సిక్కిమ్ పర్యటనకు వచ్చిన ఇద్దరు డెన్మార్క్ టూరిస్టులు అక్కడి రోడ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి తట్టుకోలేక రోడ్లు శుభ్రం చేసే పనిని తమ భుజానికి ఎత్తుకున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న చెత్తను ఓ కవర్‌లోకి ఎత్తి చెత్తబుట్టలో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Danish tourists clean sikkim roads: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!
Danish tourists clean sikkim roads

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పరిశుభ్రత గురించి అందరికీ తెలిసిందే. దేశం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా జనాల్లో పౌర స్పృహ ఆశించిన మేరకు పెరగలేదు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపించడమే ఇందుకు ఉదాహరణ. ఈ తీరు కారణంగా విదేశాల్లో కూడా భారత్‌పై చెడు అభిప్రాయం మొదలవుతోంది. ఇంత జరుగుతున్నా చాలా మంది భారతీయుల్లో ఎలాంటి చలనం కనిపించదు. కొందరు ఎప్పటిలాగే తమ చెత్తనంతా రోడ్డు మీద వేస్తుంటారు. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలన్న ఆలోచన కూడా ఇలాంటి వాళ్లకు ఉన్నట్టు కనిపించదు. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే చివరకు విదేశీయులు కూడా తట్టుకోలేక రోడ్లను శుభ్రం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇందుకు సంబంధించిన ఉదాహరణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Also Read: విమానం టేకాఫ్ అవుతుండగా ఊహించని ఘటన!

ఇటీవల ఇద్దరు డెన్మార్క్ టూరిస్టులు ఉత్తర సిక్కిమ్‌లోని యుమ్‌థాంగ్ లోయను సందర్శించేందుకు వచ్చారు. ఆ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తు్న్న తరుణంలోనే వీధుల్లో వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి వారు తట్టుకోలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశస్తులు సాధారణంగా ముఖం తిప్పుకుని వెళ్లిపోతుంటారు. మరికొందరు ఈ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి భారత్‌లోని పరిస్థితులను విమర్శిస్తూ నెట్టింట వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.

కానీ, డెన్మార్క్ టూరిస్టులు మాత్రం బాధ్యతగా వ్యవహరించారు. ఇది తమ మాతృదేశం కాదని తెలిసీ వీధులను శుభ్రం చేశారు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న చెత్తన ఓ కవర్‌లో వేసి డస్ట్‌బన్‌లో వేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రకు మనుషులుగా తమ బాధ్యత నిర్వహించి గొప్పదనాన్ని చాటుకున్నారు.


Also Read: జీవితంలో ఒత్తిడిని జయించాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి

ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు ఆ టూరిస్టులపై ప్రశంసల వర్షం కురిపించారు. పర్యావరణంపై వారికున్న శ్రద్ధ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం భారతీయులపై విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీయులు మన రోడ్లను శుభ్రం చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలని కామెంట్ చేశారు. ఇది భారతీయులకు ఓ మేలుకొలుపు వీడియో అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Mar 20 , 2025 | 07:40 AM