Housing: పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:29 PM
Housing land regularization ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని.. నివాసం ఉంటున్న పేదలకు ఆయా స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీవాళ్లకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి.

150 గజాలలోపు ఉచిత రిజిస్ర్టేషన్
కుటుంబంలో మహిళ పేరుతో పట్టా
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీల స్వీకరణ
ఇచ్ఛాపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని.. నివాసం ఉంటున్న పేదలకు ఆయా స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీవాళ్లకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే ప్రభుత్వ స్థలాల్లో పాకలు, రేకులషెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నవారి గురించి పట్టించుకోలేదు. ఇటువంటి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు మాత్రమే దీనిని అమలు చేయాలని అధికారులకు ఆదేశించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబరు 15 తేదీకి ముందు నుంచీ నివాసం ఉంటున్న వారికి మాత్రమే ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 150 గజాలలోపు స్థలంలో నివాసం ఉంటే ఉచిత రిజిస్ర్టేషన్ చేయనుంది. 150 గజాల నుంచి 450 గజాల వరకు స్థలానికి రిజిస్ర్టేషన్ విలువలో 50శాతం చెల్లించాలి. ప్రభుత్వ స్థలాల్లో ఇటుకల గోడపై సిమెంట్ రేకులతో వేసిన షెడ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్నవారికి రాష్ట్రంలో మరెక్కడా సొంత ఇంటి జాగా లేకపోతేనే క్రమబద్ధీకరణ చేస్తారు. కుటుంబంలో మహిళ పేరుతో ఇంటి పట్టా అందజేస్తారు. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు స్వీకరించనున్నారు. సర్వేయర్లు, వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం తహసీల్దార్లకు నివేదిక అందజేస్తారు. కాగా.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పది ఎకరాలకు మించి మెట్టు, ఐదు ఎకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా అనర్హులుగా పరిగణిస్తారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, కార్లు, వ్యవసాయం కోసం వినియోగించే ట్రాక్టర్లు, రవాణా ట్రక్కులున్న వారికి కూడా ఈ పఽథకం వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గతంలో స్థలం, ఇల్లు పొంది ఉన్నా.. ఈ పథకానికి అనర్హులేనని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ విషయమై ఇచ్ఛాపురం తహసీల్దార్ ఎన్.వెంకటరావు వద్ద ప్రస్తావించగా.. 2019 అక్టోబరుకు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న నిరుపేదలకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.