Gamblng Apps: బెట్టింగ్ యాప్‌ల ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు.. గంటకు వందల కోట్లు
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:50 PM
బెట్టింగ్ యాప్‌ల పేరుతో గంటలకు వందల కోట్ల వ్యాపారం., రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. లక్షల్లో నష్టపోతున్న సామాన్య ప్రజలు.. ప్రతి గ్రామంలో విస్తరించిన బెట్టింగ్ మార్కెట్.. సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే.. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ నిర్వహకులపై చర్యలు ఉండవా..

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లపై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్‌పై కేసులు నమోదవుతున్నా.. బెట్టింగ్ యాప్‌ల నిర్వహకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్‌లు చలామణిలో ఉన్నాయి.
ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. బెట్టింగ్ యాప్‌ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం ఒకరే. సాఫ్ట్‌వేర్ కోసం ప్రతి నెల కొంతమొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా రోజుకు వందల కోట్ల రూపాయలను నిర్వహకులు సంపాదిస్తున్నారు. ఈజీగ డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్‌లను ఒక మార్గంగా ఎంచుకుంటూ.. సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు యాప్ నిర్వహకులు. బెట్టింగ్ ఓ రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపించి బెట్టింగ్ యాప్ నిర్వహకులు రెచ్చిపోతున్నారు. జాయినింగ్ బోనస్‌ల పేరిట మొదట బెట్టింగ్‌కు అలవాటుచేసి ఆ తర్వాత బెట్టింగ్ అనే ఊబిలోకి దించుతున్నారు. ఓసారి బెట్టింగ్‌కు అలవాటుపడితే బయటకు రావడం కష్టంగా మారుతోంది. దీంతో చేసేదేమిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య ఎక్కువుగానే ఉంటుంది.
యాప్‌లపై చర్యలేవి..
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు పెట్టడంవలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వీటిని సెలబ్రెటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు.కానీ ఇప్పటికే బెట్టింగ్‌కు బానిసలుగా మారిన వారిని కాపాడటం కష్టమే. నేరుగా బెట్టింగ్ యాప్ నిర్వహకులు, బెట్టింగ్ యాప్‌లకు సాఫ్ట్‌వేర్ విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటేనే ఏదైనా ఫలితం ఉండొచ్చు. సెలబ్రటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువుగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్‌లో రిజిస్ట్రర్ కావాలంటూ ఆకర్షించడంతో పాటు.. జాయినింగ్ బోనస్ రూ.500 వరకు ఫ్రీగా పొందండనే ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తీరా జాయినింగ్ బోనస్‌తో ఆడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదు.
ఫస్ట్ డిపాజిట్ కంప్లసరీ అని బెట్టింగ్ యాప్ నిర్వహకులు షరతులు విధిస్తారు. దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వెయ్యి రూపాయిలు డిపాజిట్ చేసిన తర్వాత రూ.5 నుంచి రూ.6 వేలు వచ్చాయనుకోండి.. డబ్బుపై ఆశతో అవి ఇంకా పెరుగుతాయనే ఆశతో ఆడి మొత్తం డబ్బులు పొగొట్టుకుంటారు. సొంత డబ్బులు రూ.వెయ్యి పోవడంతో వాటి రికవరీ కోసం మరింత డిపాజిట్ చేస్తూ బెట్టింగ్‌కు బానిసలుగా మారుతున్నారు చాలామంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఫోన్, కంప్యూటర్‌లో ఓపెన్ కాకుండా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు యాప్ నిర్వాహకులపై చర్యలతోనే ఈ బెట్టింగ్ యాప్‌లకు పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here