TDP: టీడీపీ.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:23 AM
Telugu People తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులంతా శ్రీకాకుళంలోని ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ప్రజలారా.. జిల్లా అభివృద్ధికి సహకరించండి
మంత్రి అచ్చెన్నాయుడు
ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం
ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణుల నివాళి
అరసవల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులంతా శ్రీకాకుళంలోని ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘దివంగత నేత నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించి.. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయాల్లోనే రికార్డు సృష్టించారు. పేదల కోసం కిలో రూ.2కే బియ్యం అందించారు. దేశంలో తొలిసారిగా సామాజిక పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. గ్రామీణ పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్యావిధానం ప్రవేశపెట్టారు. పేదల సంక్షేమ ధ్యేయంగా పాలనలో ఎన్నో సంస్కరణలు చేపట్టి.. ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం. సీఎం చంద్రబాబునాయుడు తెలుగుజాతి ఆత్మవిశ్వాసం. వైసీపీ పాలనతో గాడితప్పిన రాష్ట్రాన్ని.. దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు కలలను నెరవేరుద్దాం. కారకర్తలే పార్టీకి బలం. వారికి, వారి కుటుంబాలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి’ అని తెలిపారు.
‘తలసరి ఆదాయంలో జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని మారుద్దాం. జిల్లా ప్రజలారా దయచేసి సహకరించండి. జిల్లాలో సుమారు 15వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భోగాపురం, మూలపేట ఎయిర్‌పోర్టులు రానున్నాయి. జిల్లాలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం పూర్తిచేస్తాం. జిల్లాకు పెద్ద పరిశ్రమను తీసుకువచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తాం. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయలేకపోతే నేను నిజమైన నాయకుడ్ని కానే కాను. ఎమ్మెల్యే గొండు శంకర్‌కు సహకరిస్తే శ్రీకాకుళం మోడల్ నియోజకవర్గంగా నిలవడం ఖాయం. అందరూ శభాష్ అనేలా జిల్లాను అభివృద్ధి చేస్తాం. మా జీవితాలు టీడీపీకి, చంద్రబాబు కుటుంబానికి అంకితమ’ని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ‘ఒక సామాన్యుడినైన నన్ను ఎమ్మెల్యేను చేసి ఆదరించిన పార్టీ టీడీపీ. నిజాయితీగా పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందనడానికి నేనే నిదర్శనం. కార్యకర్తలు, ప్రజల సహకారంతో ఎన్టీఆర్ ఆశయాలను, సీఎం చంద్రబాబు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయమ’ని తెలిపారు.
అనంతరం జిల్లావ్యాప్తంగా పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న 12 మందిని మంత్రి అచ్చెన్న సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, చౌదరి బాబ్జీ, మెండ దాసునాయుడు, టీడీపీ అధ్యక్షుడు నగర మాదారపు వెంకటేష్, గొండు జగన్నాథరావు, చిట్టి నాగభూషణరావు, అంధవరపు ప్రసాద్, పైడిశెట్టి జయంతి, పీరుకట్ల విఠల్, మొదలవలస రమేష్, చిట్టి మోహన్, శీర రమణయ్య, పీఎంజె.బాబు, బరాటం గుప్త, ఇప్పిలి తిరుమలరావు, కవ్వాడి సుశీల పాల్గొన్నారు.