Bahuda river: అప్పుడు ముంపు.. ఇప్పుడు ఎద్దడి
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:27 PM
Water Crisis ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో బాహుదా నది ఉన్నా, ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదు. ఎగువ ప్రాంతంలోని ఒడిశాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే అందుకు కారణం.

అస్తవ్యస్తంగా గ్రోయిన్లు
వర్షాకాలంలో పోటెత్తుతున్న వరద
ఏటా బెల్లుపడకు తప్పని ఇబ్బందులు
1800 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం
ఇచ్ఛాపురం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో బాహుదా నది ఉన్నా, ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదు. ఎగువ ప్రాంతంలోని ఒడిశాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే అందుకు కారణం. పోనీ జిల్లాలో సాగునీటి వనరుల నిర్మాణం నోచుకోవడం లేదు. ఉన్న వాటి నిర్వహణ సక్రమంగా లేదు. ముఖ్యంగా గ్రోయిన్ల నిర్వహణ చేపట్టకపోవడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.
ఇచ్ఛాపురం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బెల్లుపడలో 1800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంతానికి ముంపు తప్పదు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాకాలంలో బాహుదా నదికి అడ్డంగా రక్షణ గోడ కావాలి. ఇతర సమయాల్లో గ్రోయిన్లు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే వర్షాకాలంలో సాగునీరు, మిగిలిన సమయాల్లో ఇతర అవసరాలకు నీరు అందుతుంది. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ప్రస్తుతం బెల్లుపడ వాసులకు ఖరీఫ్, రబీ సమయాల్లో సాగునీరు అందదు. వర్షాకాలంలో అయితే ముంపు తప్పదు.
అస్తవ్యస్తంగా కాలువ
బెల్లుపడలో 1800 ఎకరాల భూమి సాగులోకి రావాలంటే బాహుదా నది కీలకం. బాహుదా నది నుంచి బెల్లుపడ కాలువ ఉంది. నది ఉత్తరం వైపున రాతికట్ట ఉంటుంది. అక్కడ నుంచి నీరు ఉత్తరం వైపు వెళ్లి బెల్లుపడ ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కానీ గ్రోయిన్ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ఏటా ఖరీఫ్‌లో బెల్లుపడ కాలువకు రైతులు సొంతంగానే మరమ్మతులు చేసుకుంటున్నారు. వరదల సమయంలో గ్రోయిన్‌కు గండి పడితే.. రైతులే సొంతంగా ఇసుక బస్తాలు వేసుకొని ఆ గండిని పూడ్చుతున్నారు. నీటిని అతి కష్టమ్మీద బెల్లుపడ కాలువకు తరలిస్తున్నారు. అయితే బాహుదాకు భారీ వరదలు సంభవించినప్పుడు బాధిత ప్రాంతం కూడా బెల్లుపడే. అందుకే బెల్లుపడకు రక్షణ గోడ నిర్మించాలి. అదే సమయంలో గ్రోయిన్ మరమ్మతులు చేపట్టాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వేసవిలోనే వీటి నిర్మాణ పనులు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
ఏటా ఇబ్బందులే..
ఏటా మాకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో వరద ముంపు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రోయిన్ పనిచేయడం లేదు. ఇక్కడ రాతికట్టు అస్తవ్యస్తంగా ఉంది. ఈ ప్రాంత సమస్యలు తప్పాలంటే రక్షణ గోడ నిర్మించాలి. ఆపై గ్రోయిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.
- ఆశి జీవులు రెడ్డి, ఆయకట్టు రైతు, బెల్లుపడ
......................
గ్రోయిన్లపై దృష్టిపెట్టాం
బాహుదా నదిలో గ్రోయిన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మరమ్మతులతోపాటు పునరుద్ధరణకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశాం. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌కు నివేదించాం. ఆయన సైతం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
- ధనుంజయరెడ్డి, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, బెల్లుపడ