removal of trees: ఇప్పుడా చేసేది?
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:53 AM
removal of trees: సంక్రాంతి సీజన్‌లో నగరం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పండుగ సమీపించేసరికి రద్దీ మరింత పెరుగుతుంది.

ఏడురోడ్ల కూడలి నుంచి డేఅండ్ నైట్ వరకు రాకపోకలకు ఇక్కట్లు
వ్యాపారులు, ప్రయాణికులు, వాహనచోదకుల ఇబ్బందులు
దెబ్బతింటున్న పండుగ వ్యాపారం
శ్రీకాకుళం అర్బన్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సీజన్‌లో నగరం విపరీతమైన రద్దీగా ఉంటుంది. పండుగ సమీపించేసరికి రద్దీ మరింత పెరుగుతుంది. పండుగ సరుకులు, కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు గ్రామాల నుంచి వస్తుంటారు. ఏ వ్యాపార దుకాణం చూసినా కిక్కిరిసి ఉంటుంది.
ఇలాంటి సమయంలో నగర సుందరీకరణ పేరిట ఏడురోడ్ల కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు పాలకొండ రోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. తొలగించిన వాటిని రోడ్డుపైనే పడేస్తుస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒక్కోసారి ట్రాఫిక్ స్తంభించి పోతోంది. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. సుందరీకరణకు ఇదా సమయం.. అంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నగర సుందరీకరణ కోసమని..
శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డు వ్యాపార రంగానికి పెట్టింది పేరు. జీటీ రోడ్డు మొదలుకొని పాలకొండ రోడ్, డే అండ్ నైట్ కూడలి వరకు ఇరువైపులా వస్త్ర, బంగారు, కిరాణా, మొబైళ్లు, వంటి దుకాణాలతో పాటు పెద్దపెద్ద హోటళ్లు ఉన్నాయి. పండగల సమయంలో ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది.
అయితే, ఈ ఏడాది అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రథసప్తమి వేడుకలు వైభవంగా జరపాలని ఆదేశించింది. దీంతో ప్రజాప్రతినిధుల సూచనల మేరకు నగర సుందరీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఏడురోడ్ల కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం వేకువజామున 4 గంటల వరకు 361 చెట్లు తొలగించారు. అయితే డివైడర్లతో పాటు తొలగించిన చెట్లను కొన్నిచోట్ల రోడ్లపై వదిలేయడంతో బుధవారం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒక వైపే రాకపోకలు జరగడంతో ఏడురోడ్ల కూడలి నుంచి డేఅండ్ నైట్ జంక్షన్‌కు వెళ్లడానికి దాదాపు అరగంట సమయం పట్టింది.
కొన్ని వాహనాలు ఏడురోడ్ల కూడలి నుంచి కాకుండా చిన్న బజార్ మీదుగా డేఅండ్‌నైట్‌కు చేరుకున్నాయి. పండగ సందర్భంగా వ్యాపారాలు మంగళవారం నుంచి ఊపందుకోవడం, అదే సమయంలో ఈ చెట్లు తొలగించి రోడ్లపై పడేయడం, ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయంటూ దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు.
మా వ్యాపారం దెబ్బతింది
మొక్కలు తొలగించడం కోసం రెండు రోజులుగా పాలకొండ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల అనాలోచిత నిర్ణయంతో మా వ్యాపారం దెబ్బతింది. రథసప్తమికి ఇంకా సమయం ఉంది. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండగా వ్యాపారాలకు ఇబ్బంది పెట్టేలా చెట్ల తొలగింపు చర్యలు చేపట్టడం దారుణం.
- ఓ వస్త్ర వ్యాపారి, పాలకొండ రోడ్
టిక్కెట్ సర్వీస్ పోయింది
శ్రీకూర్మం నుంచి డేఅండ్ నైట్ వరకు సర్వీస్ చేస్తుంటా. రెండు రోజులుగా చెట్లు కొడుతుండడంతో సూర్యమహాల్ మీదుగా రామలక్ష్మణ కూడలి, ఇలిసిపురం మీదుగా డేఅండ్ నైట్ వెళ్తున్నా. దీంతో ఇబ్బందిగా ఉంది. టిక్కెట్ చార్జీ కంటే డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. పండుగ సమయంలో ఇటువంటి చర్యలు సరికావు.
-కాంతారావు ఆటో డ్రైవర్ (శ్రీకూర్మం)
నగరసుందరీకరణలో భాగంగానే..
రథసప్తమిని మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నాం. దీనికోసం నగర సుందరీకరణలో భాగంగా చెట్లు తొలగించాం. చెట్లు బలంగా నాటుకుపోవడంతో తొలగించడానికి సమయం పట్టింది. యుద్ధప్రాతిపదికన తొలగించి రోడ్డు క్లియరెన్స్ చేస్తున్నాం. గురువారం ఉదయం నాటికి పూర్తిగా చెట్లను తరలిస్తాం.
- పీవీవీ ప్రసాదరావు, నగరపాలక కమిషనర్