Power Distribution: డిస్కమ్‌లను ఆదుకోండి
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:52 AM
వినియోగదారుల సంతృప్తిని పెంచేందుకు డిస్కమ్‌లను బలోపేతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. అధిక వడ్డీ రుణాలతో డిస్కమ్‌లు ఆర్థికంగా దెబ్బతిన్నాయని, కేంద్రం తక్కువ వడ్డీ రుణాలను అందించాలని సూచించారు. పునరుద్ధరణ విద్యుత్తును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, రాష్ట్రానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.

నష్టాల్లో ఉన్న సంస్థలకు సహకారం అందించండి
కేంద్ర మంత్రి యశోనాయక్‌కు ఇంధన మంత్రి గొట్టిపాటి వినతి
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వినియోగదారుడి సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను బలోపేతం చేసేలా సహకారం అందించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్రాన్ని కోరారు. అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కమ్‌లు నష్టాల్లో నడుస్తున్నందున వినియోగదారుడికి సరసమైన ధరల్లో సేవలు అందించడంలో సంస్థలు విఫలమవుతున్నామని తెలిపారు. విద్యుత్తు లైన్లను ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి ఉందని, కానీ, అలా చేయకపోవడం వల్ల విద్యుదాఘాతాలతో మృతి చెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందన్నారు. ఈ మేరకు డిస్కమ్‌ల బలోపేతంపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి మంత్రి విన్నవించారు. ఈ కమిటీలో పలు రాష్ట్రాల విద్యుత్తు శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన ఈ కమిటీ శనివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవ్‌లో మరోసారి భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. సమావేశంలో గొట్టిపాటి పలు అంశాలను ప్రస్తావించారు.
కేంద్ర సహకారంతో రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ సిస్టమ్(ఆర్‌డీఎ్‌సఎస్) కింద డిస్కమ్‌ల స్వయం సమృద్ధికి చర్యలు చేపడుతున్నా.. మౌలిక సదుపాయాల కోసం భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఏపీలో 3 డిస్కమ్‌లకు రూ.62,000 కోట్ల మేర అప్పులు ఉన్నాయి.
డిస్కమ్‌లు.. నిర్వహణ కోసం ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. వడ్డీలు చెల్లించలేక.. వాయిదాలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో డిస్కమ్‌లు ఆర్థికంగా చితికిపోతున్నాయి. డిస్కమ్‌లకు తక్కువ వడ్డీకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలు రుణాలు ఇచ్చేలా కేంద్రం ఆదేశించాలి.
పాతకాలంనాటి ట్రాన్స్‌మిషన్ విధానాల వల్ల రైతులు, సామాన్యులు విద్యుదాఘాతంతో చనిపోతున్నారు. వీటి నివారణకు ఎప్పుటికప్పుడు ట్రాన్స్‌మిషన్ వైర్లు మార్చాలి. విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాల విషయంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం వినియోగించాలి. రాష్ట్రాలకు మళ్లీ ‘ఉదయ్’ కింద సహకారాన్ని అందించాలి.
వ్యయసాయ క్షేత్రాల్లో తరచూ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరుగుతున్నాయి. కొత్తవి బిగించేందుకు సరళీకృత విధానాలు అమలు చేయాలి.
వైసీపీ పాలనలో అప్పులు!
2014-19 మధ్యకాలంలో వినియోగదారులపై చార్జీల భారాన్ని మోపకుండా.. మిగులు విద్యుత్తుతో ముందుకు సాగామని మంత్రి గొట్టిపాటి వివరించారు. కానీ, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పునరుద్పాదక విద్యుత్తు రంగ సంస్థలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసిందని తెలిపారు. దీంతో విద్యుత్ కొరత ఏర్పడిందని వివరించారు. కొరతను అధికమించేందుకు మర్కెట్లో అధిక ధరలకు కరెంటును కొనుగోలు చేశారని తెలిపారు. ప్రైవేటు సంస్థలకు డబ్బులు చెల్లించడం కోసం ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చారని వివరించారు. 2019-24 మధ్యకాలంలో ఏపీ విద్యుత్ రంగం రూ.1,30,000 కోట్ల మేర అప్పుల భారంలో కూరుకుపోయిందన్నారు. 2024లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక పునరుద్పాదక విద్యుత్తురంగాన్పి ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పారు. కేంద్ర దిశా నిర్దేశం మేరకు ఏపీలో క్లీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తున్నామని గొట్టిపాటి తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీలాంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తిని చేపడుతున్నందున రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్రమంత్రి యశోనాయక్‌ను అభ్యర్థించారు. రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రుల కమిటీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రితో గొట్టిపాటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాయలసీమ ప్రాంతంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తుతో కూడిన హైబ్రీడ్ విద్యుత్తుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. ఈ గ్రిడ్ ఏర్పాటుకు రూ.28,000 కోట్ల అందించాలని అభ్యర్థించారు. సీమలో అదనంగా 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గొట్టిపాటి కోరారు. దీనికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మెగావాట్‌కు రూ.20లక్షల చొప్పున సాయాన్ని అందించాలన్నారు. పల్నాడులో రెండు పునరుద్పాదక ఇంధన పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ పార్కులకు సహకారాన్ని అందించాలన్నారు. ఈ అభ్యర్థనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు రవికుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News