Share News

మట్టి పాత్రలు మన్నికగా..!

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:02 AM

వంట చేయడానికి మట్టి పాత్రలు ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మట్టితో తయారు చేసిన పాత్రలు, కుండల మీద సన్నని రంధ్రాలు ఉంటాయి...

మట్టి పాత్రలు మన్నికగా..!

వంట చేయడానికి మట్టి పాత్రలు ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మట్టితో తయారు చేసిన పాత్రలు, కుండల మీద సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటివల్ల ఆహారం నెమ్మదిగా ఉడుకుతుంది. దీంతో ఆహారంలోని పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. అంతేకాదు మట్టి పాత్రల్లో వండేటప్పుడు నూనె ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా ఎన్నో ప్రయోజనాలను అందించే మట్టి పాత్రలు చాలాకాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

  • ముందుగా మట్టి పాత్రను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల పాత్ర మీద ఉండే సన్నని రంధ్రాలు తేమను నింపుకుంటాయి. దీంతో మట్టి పాత్రను వేడి చేసినప్పుడు దానిమీద పగుళ్లు రావు.

  • మట్టి పాత్రలో నీటిని నింపి స్టవ్‌ మీద పెట్టి చిన్న మంట మీద కొద్దిగా వేడి చేయాలి. తరవాత ఈ నీటిని పారబోసి పాత్రను వంటకు వాడుకుంటే చాలాకాలం మన్నికగా ఉంటుంది.


  • మట్టి పాత్రలను పెద్ద మంట మీద పెట్టకూడదు. అలా పెడితే అవి ఎక్కువగా వేడెక్కి పగిలిపోతాయి. మంట ఎప్పుడూ మధ్య స్థాయి లేదా చిన్నగా ఉండాలి.

  • మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు వాటిలోని ఆహారాన్ని కలపడానికి స్టీల్‌ లేదా ఇనప గంటెలు వాడకూడదు. ఇవి వాడితే పాత్ర లోపలి భాగం దెబ్బతింటుంది. చెక్క లేదా సిలికాన్‌ గరిటెలు ఉపయోగించడం మంచిది.

  • వంట పూర్తయిన తరవాత మట్టి పాత్రలను స్క్రబ్బర్‌తో మెల్లగా తోమాలి. ఎక్కువగా నీళ్లు పోస్తూ కడగాలి. ఏమాత్రం అశ్రద్ద వహించినా పాత్రలు పగిలిపోతాయి. శుభ్రం చేసిన మట్టి పాత్రలను పలుచని గుడ్డతో తుడిచి గాలికి ఆరబెట్టాలి. తరవాత గుడ్డలో చుట్టి ఉంచితే వాటిపై దుమ్ము పడకుండా ఉంటుంది.

Updated Date - Mar 20 , 2025 | 03:02 AM