Share News

Gates Foundation: గేట్స్‌ @ ఏపీ

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:19 AM

ఆంధ్రప్రదేశ్‌తో ‘గేట్స్‌ ఫౌండేషన్‌’ చేతులు కలిపింది. కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, సమర్థంగా సేవలందించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది.

Gates Foundation: గేట్స్‌ @ ఏపీ
CM Chandrababu Naidu

గేట్స్‌ ఫౌండేషన్‌తో ప్రభుత్వం ఒప్పందం

  • విద్య, వైద్యం, సాగు రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సహకారం

  • ఢిల్లీలో బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

  • ఈ ఒప్పందం చరిత్రాత్మకం

  • స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర

  • అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగం

  • సమర్థంగా, వేగవంతంగా సేవలు

  • త్వరలో రాష్ట్రానికి బిల్‌ గేట్స్‌ రాక

  • 1995 నుంచి స్నేహ బంధం: సీఎం

  • టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు దార్శనికుడు: గేట్స్‌

న్యూఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌తో ‘గేట్స్‌ ఫౌండేషన్‌’ చేతులు కలిపింది. కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, సమర్థంగా సేవలందించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, మెడికల్‌ టెక్నాలజీ, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపొందించడం, కృత్రిమ మేధ (ఏఐ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ నిర్ణయించాయి. బుధవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గేట్స్‌ ఫౌండేషన్‌ అధినేత, మైక్రోసాఫ్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కీలక చర్చలు జరిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ అవగాహన ఒప్పంద పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఆయా రంగాల్లో ఖర్చు తగ్గించడంతో పాటు విస్తృత ప్రయోజనాలు కలిగేలా పనిచేయనున్నాయి.


అభివృద్ధి లక్ష్యాలు సాధిస్తాం

బిల్‌ గేట్స్‌తో సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బిల్‌ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా, ఫలవంతంగా జరిగిందని, తమ మఽధ్య కుదిరిన ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. 1995 నుంచీ బిల్‌ గేట్స్‌తో తనకు స్నేహ సంబంధాలున్నాయని, తమ భేటీ కొనసాగుతూ వస్తోందని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన విషయంలో ప్రజా సంక్షేమం, సేవలు సమర్థంగా, వేగంగా అందించేందుకు అధునాతన టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో ఎదుర్కొనే సమస్యలను కూడా దీనివల్ల పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలనే లక్ష్యానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమ లక్ష్యం సాధించేందుకు బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌తో ఏర్పడిన ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. తనకు సమయం ఇచ్చి తన అభిప్రాయాలను పంచుకున్నందుకు, ఏపీ ప్రగతికి మద్దతు ఇస్తున్నందుకు బిల్‌ గేట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో బిల్‌ గేట్స్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు అంగీకరించారని, తిరుపతిని కూడా సందర్శించాలని కోరానని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ ఎంఓయూ ద్వారా ఏఐ ఆధారిత పాలన, ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో గణనీయమైన ఫలితాలను సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అనుసరించదగ్గ ప్రభావం చూపుతుందని చంద్రబాబు చెప్పారు.


భాగస్వామ్య సంస్థలకు అండ

ఎంఓయూ ప్రకారం ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాల్లో అధునాతన టెక్నాలజీని అందించే భాగస్వామ్య సంస్థలను గేట్స్‌ ఫౌండేషన్‌, ఏపీ ప్రభుత్వం గుర్తిస్తాయని, ఈ సంస్థలకు ఫౌండేషన్‌ మద్దతు అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య రంగంలో అధునాతన టెక్నాలజీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించాయి. వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత సలహా వేదికలతో పాటు వ్యవసాయాన్ని, వనరుల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేస్తారని తెలిపాయి.


ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది: బిల్‌ గేట్స్‌

వినూత్న సాంకేతిక పరిష్కారాల ద్వారా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక దృక్పథంతో కోరుకోవడం హర్షణీయమని బిల్‌ గేట్స్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ మధ్య భాగస్వామ్యం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన, స్థానికంగా ఉత్పత్తి చేసే వైద్య పరికరాల ద్వారా అణగారిన వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరచాలని నిర్ణయించడం ముఖ్యమైన విషయమన్నారు.తర్వాత చంద్రబాబు అమరావతి బయలు దేరారు. సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, ఎంపీ కృష్ణదేవరాయలు, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, సీఎంవో అధికారులు, గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


జేపీ నడ్డాతో గేట్స్‌ సమావేశం

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో బిల్‌ గేట్స్‌ సమావేశమయ్యారు. ఆరోగ్య రంగంలో భారత్‌ పురోగతి గురించి చర్చించినట్టు నడ్డా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

బిల్‌ గేట్స్‌తో భేటీ అద్భుతం: బాబు అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గేట్స్‌ ఫౌండేషన్‌ అధినేత బిల్‌ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్‌ ఫౌండేషన్‌ సహకారంపై కీలక చర్చలు జరిపామని పేర్కొన్నారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌ను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్‌ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ పురోగతికి బిల్‌ గేట్స్‌ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని బాబు పేర్కొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 07:45 AM