పాఠకులు నాతో ప్రయాణం చేస్తారు
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:10 AM
శాస్త్రీయ అంశాలను అందరికీ అర్ధమైయ్యే సులభమైన భాషలో చెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి వంటి అంశాలను సులభతరంగా చెప్పటం చాలా కష్టం. ఇలాంటి కష్టమైన..

శాస్త్రీయ అంశాలను అందరికీ అర్ధమైయ్యే సులభమైన భాషలో చెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి వంటి అంశాలను సులభతరంగా చెప్పటం చాలా కష్టం. ఇలాంటి కష్టమైన విషయాన్ని తనదైన రీతిలో పాఠకుల ముందుకు తీసుకువచ్చిన శాస్త్రవేత్త బ్రిటన్‌కు చెందిన క్లాడా రమ్. ఆమె రాసిన ‘ది బ్యూటీ ఆఫ్ ఫాలింగ్: ఏ లైఫ్ ఇన్ పర్‌సూట్ ఆఫ్ గ్రావిటీ’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే భారత దేశంలో పర్యటించిన క్లాడాతో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
గురుత్వాకర్షణ వంటి కష్టతరమైన అంశంపై సాహిత్యపరమైన పుస్తకం రాయటం ఎంత కష్టం?
ఈ పుస్తకం సామాన్య పాఠకులకు ఒక ప్రయాణం లాంటిది. నేను ఒక సిద్ధాంతం గురించి చెబితే వారు వినటమనేది జరుగుతూనే ఉంటుంది. కానీ దీనిలో పాఠకులు కూడా నాతో పాటే ప్రయాణం చేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమదైన దృష్టికోణం నుంచి చూస్తారు. అనుభూతి పొందగలుగుతారు.
భౌతిక శాస్త్రంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ కదా. దీనికి కారణాలేమిటి?
శాస్త్రవేత్తలు రెండు రకాలుగా ఉంటారు. కొందరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. కొందరు ప్రయోగాలు చేస్తారు. భౌతికశాస్త్ర పరిశోధనా రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో చాలా మంది మహిళలు భౌతికశాస్త్రాన్ని చదువుతారు. యూనివర్సిటీకి వచ్చే సమయానికి వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇక పరిశోధన రంగంలోకి వచ్చే మహిళలు ఇంకా తక్కువగా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. సైన్స్ అనేది చాలా క్లిష్టమైన విషయం కాదు. సిద్ధాంతాలను రాతిపై రాసి చెక్కరు. ఇదే విధంగా శాస్త్రవేత్తలనగానే- కళ్లజోడు పెట్టుకొని గంభీరంగా ఉండరు. ఇలాంటి రకరకాల అభిప్రాయాలు తొలగిపోతే సైన్స్‌కు చాలా మంచి జరుగుతుంది. అందుకే నేను పుస్తకాన్ని రాశాను. దీనిని చదివిన తర్వాత సైన్స్‌పై వారికి ఉన్న దృష్టి కోణం మారుతుందని భావిస్తున్నాను.
మీరు అనేక పతకాలు గెలిచిన స్విమ్మింగ్ ఛాంపియన్.. వ్యోమగామి కావటానికి శిక్షణ కూడా పొందారు. గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పమంటే ఏం చెబుతారు?
గురుత్వాకర్షణ శక్తి మనకు స్వేచ్ఛను ఇస్తుంది. ఒక క్షణం గురుత్వాకర్షణ శక్తే లేదనుకుందాం. అప్పుడు మనందంరం ఎలా ఉండేవాళ్లం? తేలుతూ ఉండేవాళ్లం. ఎలా అయినా స్వేచ్ఛగా వెళ్లే శక్తి ఉండేది. ఈ స్వేచ్ఛను నేను వ్యక్తిగతంగా కూడా కోరుకుంటాను. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. చాలా మంది నన్ను... ‘‘మీరు ఈ విశ్వంపై ఎందుకు పరిశోధన చేస్తున్నారు? గురుత్వాకర్షణపై మీకున్న ఆసక్తి ఏమిటి?’’ అని అడుగుతూ ఉంటారు. నాకు విశ్వం.. గురుత్వాకర్షణ శక్తి కాకుండా మిగిలిన విషయాలన్నీ చాలా సంక్లిష్టంగా అనిపిస్తాయి. ఉదాహర ణకు బయాలజీని తీసుకుందాం. దీనిలో ప్రతి విషయం ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటుంది. ఒక విషయాన్ని అధ్యయనం చేయాలంటే మిగిలిన వాటి గురించి కూడా తెలుసుకోవాలి. గురుత్వాకర్షణ విషయంలో ఇలాంటి సమస్య ఉండదు. ఇది మన విశ్వానికి సంబంధించిన మౌలికమైన అంశం. దీనిపై పరిశోధనవల్ల అనేక లోతుపాతులు తెలుసుకోగలు గుతాను. ఉదాహరణకు మీరు ఒక విమానాన్ని నడుపుతునా ్నరనుకుందాం. విమానం ఇంజిన్‌ను స్టార్ట్ చేసే ముందు ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లిన తర్వాత మొత్తం దృష్టంతా ఆకాశంపైనే ఉంటుంది. ఇతర ఆలోచనలు ఏమి రావు.
ఈ మధ్యకాలంలో ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గింది. ఎక్కువ మంది ఐటీ, ఐటీ ఆధారిత సేవలవైపే మొగ్గు చూపుతున్నారు కదా.. దీనిపై మీ అభిప్రాయమేమిటి?
గతంలో మన సమాజంలో శాస్త్రవేత్తలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఇప్పుడు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఎక్కువమంది ప్రజలకు దీర్ఘకాలిక పరిశోధనలకు ఉన్న అవసరంపై అవగాహన లేకపోవటమే! ఈ రోజు మానవుడు భూమిపై సురక్షితంగా నివసించటానికి అనేక లక్షల సంవత్సరాల పరిశోధనల ఫలితాలే కారణం. ఇప్పుడు అలాంటి పరిశోధనలు జరగకపోతే ఆ ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది. అది చాలా ప్రమాదకరం కూడా! మన జీవనశైలిని మెరుగుపరిచే కొత్త కొత్త టెక్నాలజీలు, అప్లికేషన్లు రావాలంటే... ప్రాథమిక స్థాయిలో కొన్ని పరిశోధనలు జరగాలి. అవి జరగకపోతే భవిష్యత్ కుంటుపడుతుంది.
సివిఎల్‌ఎన్ ప్రసాద్