Prevent Recurrent Miscarriages: వరుస గర్భస్రావాలకు అడ్డుకట్ట ఎలా
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:05 AM
సాధారణంగా గర్భస్రావాన్ని నివారించడం కోసం కొందరు మహిళలకు గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వైకల్ స్టిచ్ అవసరమవుతుంది. 16 వారాల తర్వాత గర్భస్రావం అయిన సందర్భాల్లో, 24 వారాల లోపు కాన్పు...

డాక్టర్! నాకిప్పుడు రెండో నెల. ఇది నా మూడో ప్రెగ్నెన్సీ. గతంలో రెండుసార్లూ ఐదో నెలలోనే గర్భస్రావం అయిపోయింది. రెండో ప్రెగ్నెన్సీలో గర్భ సంచికి కుట్టు వేసినా గర్భం నిలవలేదు. ప్రస్తుత గర్భం నిలవాలంటే ఏం చేయాలి?
ఓ సోదరి, హైదరాబాద్
సాధారణంగా గర్భస్రావాన్ని నివారించడం కోసం కొందరు మహిళలకు గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్వైకల్ స్టిచ్ అవసరమవుతుంది. 16 వారాల తర్వాత గర్భస్రావం అయిన సందర్భాల్లో, 24 వారాల లోపు కాన్పు జరిగిపోతున్న సందర్భాల్లో, ఉమ్మనీరు కోల్పోతున్న సందర్భాల్లో, సర్విక్స్ ప్రాంతంలో సర్జరీలు జరిగి ఉన్న సందర్భాల్లో, గర్భం దాల్చిన 12 నుంచి 24 వారాల మధ్య ఈ కుట్టు వేస్తారు. అయితే మీ విషయంలో గర్భం నిలవడం కోసం గర్భసంచికి కుట్టు వేసినా గర్భస్రావం అయిందని అంటున్నారు.
కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ట్రాన్స్ అబ్డామినల్ సర్‌క్లేజ్ చేయవలసి ఉంటుంది. పొట్ట మీద చిన్న గాటు పెట్టి, ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ చికిత్స చేయడం జరుగుతుంది. అయితే వరుస గర్భస్రావాలు జరుగుతున్న మహిళలకు గర్భం దాల్చక ముందే ఈ చికిత్స చేయాలి. కానీ మీరు ఇప్పటికే గర్భం దాల్చి ఉన్నారు కాబట్టి 12 వారాల స్కాన్ తర్వాత అబ్డామినల్ సర్‌క్లేజ్ వేయించుకోవచ్చు. అందుకు ఎంతో నైపుణ్యం అవసరమవుతుంది. అందుకు నిపుణులైన వైద్యులను ఆశ్రయించాలి. సర్‌క్లేజ్ వేయించుకున్న గర్భిణులకు సాధారణ ప్రసవం సాధ్యపడదు. తప్పనిసరిగా సిజేరియన్ చేయవలసి వస్తుంది. ట్రాన్స్ అబ్డామినల్ సర్‌క్లేజ్ వల్ల గర్భం నిలిచే అవకాశం వెజైనల్ సర్‌క్లేజ్ కంటే మెరుగ్గా ఉంటుంది.
డాక్టర్ ప్రమత శిరీష
కన్సల్టెంట్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
బర్త్‌రైట్ బై రెయిన్‌బో, సికింద్రాబాద్.