Share News

Tirupati: ఒకే కుటుంబంలోని ఐదుగురి కిడ్నాప్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:20 AM

తిరుపతిలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఒకే కుటుంబంలోని ఐదుగురిని కిడ్నాప్‌ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు రాజేశ్‌ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని సమాచారం అందించడంతో, పోలీసులు బాధిత కుటుంబాన్ని రక్షించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Tirupati: ఒకే కుటుంబంలోని ఐదుగురి కిడ్నాప్‌

తిరుపతిలో కలకలం.. ఆర్థిక లావాదేవీలే కారణం

రూ.రెండు కోట్లు డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు

తప్పించుకునే క్రమంలో కారులో నుంచి దూకిన భర్తకు తీవ్ర గాయాలు

భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఆర్థిక లావాదేవీల కారణంతో ఒకే కుటుంబంలోని ఐదుగురిని కిడ్నాప్‌ చేసిన ఘటన తిరుపతిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రూ.రెండు కోట్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించిన ఈ ఘటన శనివారం వెలుగులోకి రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అలిపిరి ఎస్‌ఐ నాగార్జున రెడ్డి కథనం మేరకు.. తిరుపతి నగరం జీవకోనలో కాపురముంటున్న రాజేశ్‌, అతడి భార్య సుమతి రెండు మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు జాస్మిత, యోక్షిత, తల్లి విజయతో కలిసి ఈ దంపతులు ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్‌ మూడేళ్ల క్రితం రాజేశ్‌ వద్ద అప్పు చేశాడు. డబ్బు తిరిగి ఇమ్మని రాజేశ్‌ అడుగుతుండడంతో భార్గవ్‌ కిడ్నాప్‌ ప్లాన్‌ చేశాడు. సెటిల్‌మెంట్లు, కిడ్నా్‌పలు చేయడంలో ఆరితేరిన అరుణ్‌ అనే వ్యక్తిని సంప్రదించి చెన్నై నుంచి కొందరు కిడ్నాపర్లను రప్పించారు. శుక్రవారం సాయంత్రం మీ-సేవ కేంద్రాన్ని మూసేసి రాజేశ్‌, సుమతి ఇంటికెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో రాజేశ్‌కు అరుణ్‌ ఫోన్‌ చేసి.. కొత్త వ్యాపారం గురించి మాట్లాడాలని, రెడ్డిభవన్‌ సమీపంలోని అక్కారంపల్లి వద్ద ఉంటున్న అపార్టుమెంటు వద్దకు రావాలని కోరాడు.


దీంతో రాజేశ్‌, సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి అపార్టుమెంటు వద్దకు వచ్చారు. అప్పటికే రెండు కార్లు సిద్ధం చేసుకుని ఉన్న కిడ్నాపర్ల బృందాలు రూ.రెండు కోట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి పంపుతామని బెదిరించారు. అంత డబ్బు తమ వద్ద లేదని, చిత్తూరులో బంధువుల వద్దకు తీసుకెళితే తీసిస్తామని చెప్పారు. దీంతో వారందరినీ కారులో తీసుకుని చిత్తూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఐతేపల్లి వద్ద రాజేశ్‌ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు గమనించి తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. అలిపిరి ఎస్‌ఐ నాగార్జున రెడ్డి రాజేశ్‌ వద్దకు వెళ్లి వివరాలు రాబట్టారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న భార్య సుమతి, ఇద్దరు పిల్లలు, తల్లిని కాపాడాలని రాజేశ్‌ వేడుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన చిత్తూరు, తిరుపతి పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:20 AM