TTD: నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:09 AM
తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

దాదాపు రూ.5,400 కోట్లతో 2025-26 బడ్జెట్
తిరుమల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలో జరుగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 5,141.74 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ ఈ ఏడాదికి దాదాపు రూ.5,400 కోట్లతో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడంతో పాటు ముడిసరుకుల కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులకు నిధుల కేటాయింపులపైనా సమావేశంలో తీర్మానాలు చేయనున్నారు. సీఎం సూచన మేరకు గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్టు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిపుణుల కమిటీ సిఫారసులపైనా చర్చించనున్నారు. ఇక వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు. అలిపిరిలో కొండలను అనుకుని ప్రైవేటు నిర్మాణాలు లేకుండా టెంపుల్ కారిడార్‌గా చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు.