TTD: రాజపాళయం ఆలయ పరకామణిలో గోల్‌మాల్!
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:21 AM
శ్రీవారి ఆలయ హుండీల్లో వచ్చే కానుకల లెక్కింపు.. భక్తుల రద్దీని బట్టి ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటుంది. హుండీలోని భారత కరెన్సీ, ఇతర కానుకలను లెక్కించే సిబ్బంది, విదేశీ కరెన్సీని మాత్రం మళ్లీ హుండీలోనే వేస్తారు.

విదేశీ కరెన్సీ లెక్క చెప్పకుండానే టీటీడీకి రికార్డులు
తర్వాత కొన్నాళ్లకు విదేశీ కరెన్సీ అప్పగింత
చెన్నై టీటీడీ సిబ్బంది నిర్వాకం
మొత్తం అప్పగించారా? చేతివాటం ప్రదర్శించారా?
(చెన్నై-ఆంధ్రజ్యోతి)
చెన్నైలో టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సిబ్బంది తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఆలయంలో విక్రయించాల్సిన లడ్డూలను కొందరు సిబ్బంది వీఐపీల ఇళ్లకు తీసుకెళ్లి పంచుతున్నారని ఆరోపణలు ఉండగా, తాజాగా విదేశీ కరెన్సీ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయ హుండీల్లో వచ్చే కానుకల లెక్కింపు.. భక్తుల రద్దీని బట్టి ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటుంది. హుండీలోని భారత కరెన్సీ, ఇతర కానుకలను లెక్కించే సిబ్బంది, విదేశీ కరెన్సీని మాత్రం మళ్లీ హుండీలోనే వేస్తారు. ఎక్కువ మొత్తం విదేశీ కరెన్సీ పోగయ్యాక, టీటీడీ బోర్డు యాజమాన్యం ఆ మొత్తాన్ని వెలుపలికి తీసి, భారత కరెన్సీలోకి మారుస్తుంది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళయంలో ఉన్న టీటీడీ ఆలయ హుండీ లెక్కింపు ప్రతి మూడు నెలలకోమారు జరుగుతుంది. గతేడాది అక్టోబరు 23వ తేదీన ఆలయంలో ‘పరకామణి’ జరిగింది. టీటీడీ చెన్నై ఏఈవో పార్థసారధి, అసిస్టెంట్‌లు ఎం.శ్రీనివాసులు, సి.బాల శ్రీనివాసులు, ఓఎస్ జి.మునికుమార్, విజిలెన్స్ అధికారి ఎం.రామకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. అందులో వచ్చిన భారత కరెన్సీతో పాటు, విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్న ఏఈవో.. చెన్నైకి తిరిగొచ్చారు. ఆ హుండీ నుంచి విదేశీ కరెన్సీ తీయడం పదేళ్ల తర్వాత అదే ప్రథమం. అంతవరకూ బాగానే ఉన్నా, అక్కడే గోల్‌మాల్ జరిగింది. హుండీలో వచ్చిన భారత కరెన్సీ రూ.8,29,790 గురించి లెడ్జర్‌లో స్పష్టంగా రాశారు. కానీ, ఇతర కానుకలు ఏమీ లేవంటూ ఆ కాలంలో నిలువునా గీత కొట్టారు.
ఆ పత్రంపై ఏఈవో, విజిలెన్స్ అధికారి, ఇద్దరు సిబ్బంది సంతకాలు చేశారు. లెడ్జర్‌లో పైన తేదీ 23.10.2023 అని పేర్కొన్నా, సిబ్బంది సంతకాల్లో మాత్రం 23.10.2024 అనే రాశారు. ఆ లెడ్జర్ కాపీని తిరుమలకు పంపేశారు. ఇందులో విదేశీ కరెన్సీ వివరాలు తెలిపే కాలాన్ని మాత్రం ఖాళీగానే ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ కొన్ని రోజుల తర్వాత ఖాళీగా విదేశీ కరెన్సీ కాలంలో అమెరికా, కెనడా డాలర్లు, మలేషియా, ఒమన్, సౌదీ అరేబియా, శ్రీలంక, యూఏఈ దేశాలకు చెందిన మొత్తం 46 కరెన్సీ నోట్ల వివరాలు పొందుపరిచారు. ఎట్టకేలకు ఆ కరెన్సీ గతేడాది డిసెంబరు 4వ తేదీన తిరుమలకు చేరింది. హుండీని నెల మధ్యలో ఎప్పుడు తెరిచినా, విదేశీ కరెన్సీని ఆ తర్వాత వచ్చే 1వ తేదీనే తిరుమలలో అప్పగించాలన్న నిబంధన ఉందని భావించినా.. రాజపాళయం ఆలయ హుండీ విదేశీ కరెన్సీ నవంబరు 1వ తేదీకే తిరుమల ఖాతాకు చేరాల్సి ఉంది. కానీ, డిసెంబరు 4వ తేదీకి గానీ విదేశీ కరెన్సీ తిరుమలకు చేరలేదని రికార్డులు చెబుతున్నాయి. ఇందులోని తిరకాసేంటో టీటీడీకే తెలియాలి.
ఎందుకంత జాప్యం? ఏమా మతలబు?
రాజపాళయం ఆలయంలో అక్టోబరు 23వ తేదీన హుండీ లెక్కింపు జరగ్గా, డిసెంబరు 4వ తేదీకి గానీ విదేశీ కరెన్సీ తిరుమలకు చేరలేదు. అప్పటి వరకూ ఆ కరెన్సీ చెన్నైలో ఎందుకుంది? తిరుమలకు ముందుగా వెళ్లిన రికార్డుల్లో విదేశీ కరెన్సీ ప్రస్తావన ఎందుకు లేదు? ఆ తర్వాత మళ్లీ లెడ్జర్‌లో ఆ కరెన్సీ గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంతకీ హుండీలోని విదేశీ కరెన్సీ మొత్తం అదేనా? లేక సిబ్బంది చేతివాటం పోగా, మిగిలింది మాత్రమే లెడ్జర్‌లో రాశారా? ఆలస్యంగా అందడంపై టీటీడీ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలేంటి? విదేశీ కరెన్సీ ప్రస్తావించకుండానే పంపిన రికార్డులపై ఏఈవోతో పాటు ఇతర సిబ్బంది ఎలా సంతకం చేశారు? పర్యవేక్షించేవారు లేకనే ఆలయంలో ఇలాంటి లొసుగులు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాపాడాల్సిన కంచే కళ్లు మూసుకుందా?
ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టాల్సిన టీటీడీ విజిలెన్స్ విభాగం కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తోంది. గతంలోనే కొందరు టీటీడీ సిబ్బంది ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ ఉన్నతాధికారిణి కళావతి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిసింది. ఆమెతో మాట్లాడేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..