Visakhapatnam: గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:10 AM
విశాఖపట్నం దువ్వాడ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 125.9 కిలోల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు సభ్యులను వెతుకుతున్నారు

పోలీసుల అదుపులో ఒకరు.. 126 కిలోలు స్వాధీనం
విశాఖపట్నం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ నుంచి విశాఖపట్నం మీదుగా ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును దువ్వాడ పోలీసులు రట్టు చేశారు. కూర్మన్నపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 125.9 కిలోల గంజాయితో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు సభ్యులు పరారయ్యారు. డీసీ పీ-2 మేరీ ప్రశాంతి శనివారం తెలిపిన వివరాలు.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారం చేసుకునే భరత్‌సింగ్, రాజ్‌సింగ్ ఇక్కడ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకువెళ్లి విక్రయిస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చని భావించారు. విశాఖలో ఉంటున్న రాజ్‌సింగ్ స్నేహితుడైన ఢిల్లీకి చెందిన అమిత్‌కుమార్‌సింగ్‌ను సంప్రతించారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి రవాణా చేసేందుకు సహకరిస్తే కమీషన్ ఇస్తామన్నారు. దీనికి అమిత్‌కుమార్‌సింగ్ సరేననడంతో గత నెలలో ఏజెన్సీ నుంచి గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీ తీసుకువెళ్లారు. భరత్‌సింగ్, రాజ్‌సింగ్‌ు మరోసారి గంజాయి తీసుకువెళ్లేందుకు ఈ నెల 2న విశాఖ వచ్చారు. ఏజెన్సీకి వెళ్లి 126 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. బ్యాగుల్లో గంజాయిని కూర్మన్నపాలెం వద్దకు తీసుకువచ్చిన భరత్‌సింగ్, రాజ్‌సింగ్ దానిని హైదరాబాద్ మీదుగా ఢిల్లీ చేర్చే బాధ్యతను అమిత్‌కు అప్పగించారు. అమిత్ హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన తరువాత భరత్‌సిం గ్, రాజ్‌సింగ్ విమానంలో ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఈ క్రమం లో అమిత్ శుక్రవారం ట్రావెల్స్ బస్సు ఎక్కేందుకు కూర్మన్నపా లెం వద్ద వేచి ఉండగా, గంజాయి తనిఖీ స్క్వాడ్‌కు సమాచారం అందింది. దువ్వాడ పోలీసులతో కలిసి అతన్ని అదుపులోకి తీసుకుని, ఆరు బ్యాగుల్లోని 125.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భరత్‌సింగ్, రాజ్‌సింగ్ పరారయ్యారు.