గ్రేటర్ రికార్డు
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:22 AM
గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను రూపేణా రూ.510 కోట్లు సమకూరింది.

ఆస్తి పన్ను రూపేణా రూ.510 కోట్లు రాక
జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధికం
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను రూపేణా రూ.510 కోట్లు సమకూరింది. జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధికం. నగర పరిధిలో 5,89,994 ప్రైవేటు అసెస్‌మెంట్‌లు, 39,391 వీఎల్‌టీ అసెస్‌మెంట్‌లు, 1,630 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అసెస్‌మెంట్‌లు, 524 కేంద్ర ప్రభుత్వ సంస్థల అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా గత జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు యాక్షన్ ప్లాన్ తయారుచేశారు. వార్డు సచివాలయాల వారీగా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల అసెస్‌మెంట్‌లను మ్యాపింగ్ చేయించారు. సచివాలయంలోని అడ్మిన్ సెక్రటరీలు తమ పరిధిలోని అసెస్‌మెంట్‌లకు వెళ్లి పన్ను బకాయిలు వసూలయ్యేలా చేయగలిగారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడం కూడా కలిసివచ్చింది. చాలామంది బకాయిదారులు పన్ను చెల్లింపునకు ముందుకువచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా రెండు నెలలుగాపైగా బాధ్యతలు నిర్వర్తిండడం కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పన్ను బకాయిలు వసూలయ్యేందుకు దోహదపడింది. వీటన్నింటి కారణంగా ఈ ఏడాది రూ.510 కోట్లకుపైగా పన్ను వసూలైంది. రికార్డు స్థాయిలో పన్నులు వసూలుకావడం ఆనందంగా ఉందని, దీనికి జిల్లా కలెక్టర్, డీసీఆర్, జోనల్ కమిషనర్లతోపాటు రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది కృషి కారణమని అదనపు కమిషనర్ సోమన్నారాయణ ఆనందం వ్యక్తంచేశారు.
నేటి నుంచి కేజీహెచ్‌లో ప్రతి రోజూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఇకపై ప్రతిరోజూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించ నున్నారు. ప్రస్తుతం కొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే రోగులను చూస్తున్నారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ సేవలందించేలా ఆస్పత్రి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. న్యూరాలజీ, యూరాలజీ, ఎండో క్రైనాలజీ విభాగాల్లో ఓపీ సేవలు ఇప్పటి వరకూ మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే అందిస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని పని దినాల్లో ఈ సేవలు అందించ నున్నారు. అలాగే, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ప్లాస్టిక్ సర్జరీ, మెడికల్ అంకాలజీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీ, సర్జికల్ అంకాలజీ, నెఫ్రా లజీ విభాగాల్లో సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అనంతరం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల ఓపీ సేవలు అందించనున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషాలిటీ వైద్యులను నిత్యం రోగులకు అందుబాటులో ఉంచే ఉద్ధేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
నేటి నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు
7వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు
మద్దిలపాలెం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం ప్రవేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు మేలు జరగనుంది. గత ఏడాది వరకు జూన్ 12న ఇంటర్ క్లాసులు ప్రారంభమయ్యేవి. ప్రైవేటు కళాశాలలు మాత్రం తమ ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి ఏప్రిల్ నుంచే తరగతులు నిర్వహించేవి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్పించుకునే ప్రయత్నాలు చేసేవి. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గేవి. ఈ నేపథ్యంలో ప్రైవేటు క ళాశాలలకు దీటుగా ప్రవేశాలు, ఉత్తీర్ణత మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తరగతులు, ప్రవేశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 27 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం పేరిట ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఆర్‌ఐవో కార్యాలయానికి 83,220 నోటు పుస్తకాలు చేరుకున్నాయి. వీటిని జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3 కేజీబీవీ కళాశాలలు, 9 జడ్పీ మోడల్ హైస్కూళ్లకు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠ్య పుస్తకాలు కూడా మారుతున్నందున త్వరలో అవి కూడా వస్తాయని అధికారులు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. గత ఏడాది కొత్త ప్రభుత్వం ఏర్పడడంతోనే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది తరగతుల ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశారు.