Share News

స్వయం ఉపాధి రుణాలకు పోటెత్తిన దరఖాస్తులు

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:29 AM

జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరుచేస్తున్న స్వయం ఉపాధి రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. డెయిరీ, చిరు వ్యాపారాలు, వాహన, సేవా రంగాల్లో రాణించాలనుకునే వారికి 50 శాతం సబ్సిడీతో రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 50 శాతం బ్యాంకు రుణంగా ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ రుణాలను ఇవ్వకుండా సంక్షేమ శాఖలను నిర్వీర్యం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రుణాల మంజూరుకు ముందుకురావడంతో జిల్లాలో వివిధ కులాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

స్వయం ఉపాధి రుణాలకు  పోటెత్తిన దరఖాస్తులు

వివిధ కార్పొరేషన్ల పరిధిలోని

2,368 యూనిట్లకు 18,984 దరఖాస్తులు

బీసీ కులాలకు చెందిన అభ్యర్థుల నుంచి

17,000 వేలకుపైగా రాక

వడబోస్తున్న అధికారులు

యూనిట్‌ వ్యయంలో 50 శాతం సబ్సిడీ,

మరో 50 శాతం రుణం

త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

జనరిక్‌ మెడికల్‌ స్టోర్స్‌ ఏర్పాటుకు స్పందన కరువు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరుచేస్తున్న స్వయం ఉపాధి రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. డెయిరీ, చిరు వ్యాపారాలు, వాహన, సేవా రంగాల్లో రాణించాలనుకునే వారికి 50 శాతం సబ్సిడీతో రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 50 శాతం బ్యాంకు రుణంగా ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ రుణాలను ఇవ్వకుండా సంక్షేమ శాఖలను నిర్వీర్యం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రుణాల మంజూరుకు ముందుకురావడంతో జిల్లాలో వివిధ కులాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లాలో బీసీ, ఈబీసీ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లకు ప్రభుత్వం 2,368 యూనిట్లు మంజూరుచేసింది. వాటి కోసం 18,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఒక్క బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి 1,615 యూనిట్లు మంజూరుకాగా, 17,040 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈబీసీ కార్పొరేషన్‌కు 36 యూనిట్లు మంజూరుకాగా 91 మంది, కమ్మ కార్పొరేషన్‌కు కేటాయించిన 14 యూనిట్ల కోసం 23 మంది, రెడ్డి కార్పొరేషన్‌కు కేటాయించిన 40 యూనిట్లకు 357 మంది, ఆర్య, వైశ్య కార్పొరేషన్‌కు కేటాయించిన 17 యూనిట్లకు 523 మంది, క్షత్రియ కార్పొరేషన్‌కు కేటాయించిన 21 యూనిట్లకు 43 మంది, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన 50 యూనిట్లకు 59 మంది, కాపు కార్పొరేషన్‌కు కేటాయించిన 452 యూనిట్లకు 655 మంది, మేదర/కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్‌కు కేటాయించిన 123 యూనిట్లకుగాను 193 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ప్రస్తుతం అధికారులు వడపోస్తున్నారు. జోన్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి రుణాలను మంజూరు చేయనున్నారు.

జనరిక్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ ఏర్పాటుకు స్పందన నిల్‌

ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖలోని ఆయా కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతతో జనరిక్‌ మందుల దుకాణాలు ఏర్పాటుచేయించాలని భావించింది. అయితే, జనరిక్‌ మెడికల్‌ స్టోర్స్‌ ఏర్పాటుకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు జిల్లాలో 33 యూనిట్లు మంజూరుచేయగా 39 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈబీసీ కులాలకు చెందిన యువత కోసం 36 యూనిట్లు మంజూరుచేయగా, ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అలాగే కమ్మ కార్పొరేషన్‌కు 14, రెడ్డి కార్పొరేషన్‌కు 40, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 50, ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు 17 యూనిట్లు మంజూరుచేయగా ఒక్క దరఖాస్తు అందలేదు. క్షత్రియ కార్పొరేషన్‌కు 21 యూనిట్లు మంజూరుకాగా, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. మొత్తం జిల్లాకు ప్రభుత్వం 211 యూనిట్లు (జనరిక్‌ మెడిసిన్‌ స్టోర్లు) మంజూరు చేయగా, 40 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా దరఖాస్తులు రాకపోవడంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:30 AM