ఉత్సవానికి వేళాయె...
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:19 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శుక్రవారం ప్రారంభం కానుంది. రాత్రి ఏడున్నర గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రంతా ఆలయాన్ని తెరిచే వుంచుతారు. నూకాంబిక అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి, ఈవో వెంపలి రాంబాబు తెలిపారు.

నేటి నుంచి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర
రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక పూజలతో ప్రారంభం
భారీఎత్తున ఏర్పాట్లు
భక్తులు ఎండబారిన పడకుండా చలువ పందిళ్లు
అనకాపల్లి టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శుక్రవారం ప్రారంభం కానుంది. రాత్రి ఏడున్నర గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రంతా ఆలయాన్ని తెరిచే వుంచుతారు. నూకాంబిక అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి, ఈవో వెంపలి రాంబాబు తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచనల మేరకు సుమారు 70 మందితో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. భక్తులు క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్లలు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండబారిన పడకుండా ఆలయ ప్రాంగణంతోపాటు సమీపంలోని రహదారులపై చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్‌లలో భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తారు. కేశఖండన తరువాత చిన్నపిల్లలకు స్నానం ఆచరించడానికి వేడినీటి సదుపాయం కల్పించారు. చంటి పిల్లలకు పాలిచ్చేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్ అందుబాటులో వుంటుంది. ఆలయం ప్రాంగణంతోపాటు ఆలయానికి వచ్చే మార్గాల్లో భారీ విద్యుత్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌కు పలుచోట్ల స్థలాలు కేటాయించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిసింది.