రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:58 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డుస్థాయికి చేరాయి.

ఇప్పటివరకూ రూ.478.63 కోట్లు వసూలు
2024-25 ఆర్థిక సంవత్సరం కంటే రూ.38 కోట్లు అధికం
నేడు మరో రూ.15 కోట్లు వసూలయ్యే అవకాశం
జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధికం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు రికార్డుస్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.478.63 కోట్లు వసూలైంది. సోమవారం వరకు గడువుండడంతో మరో రూ.15 కోట్లు వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ చరిత్రలో ఇదే అత్యధిక వసూలని రెవెన్యూశాఖ అధికారులు పేర్కొనడం విశేషం.
జీవీఎంసీకి ప్రధాన ఆర్థిక వనరు ఆస్తి, ఖాళీస్థలాల పన్నులు. ఈ ఆదాయంతోనే నగరంలో అభివృద్ధి పనులు చేపడుతుంటారు. నగర పరిధిలో 5,89,994 ప్రైవేటు అసెస్‌మెంట్లు, 39,391 వీఎల్‌టీ అసెస్‌మెంట్‌లు, 1,630 రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అసెస్‌మెంట్లు, 524 కేంద్రప్రభుత్వ సంస్థల అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.440 కోట్లు పన్ను వసూలైంది. కొన్ని అసెస్‌మెంట్‌లకు సంబంధించిన యజమానులు పన్నులు చెల్లించకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయింది.
లక్ష్యం దిశగా పయనం
ఇదిలా ఉండగా 2024-25లో రూ.480 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యం మేరకు రెవెన్యూ విభాగం అధికారులు ప్రణాళికలు రచించి, అమలుచేశారు. దీంతో ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఒకరోజు గడువుండగా, ఆదివారం నాటికి రూ.478.63 కోట్లు వసూలైంది. అందులో రూ.412 కోట్లు పన్నులు, వీఎల్‌టీ ద్వారా రూ.66.63 కోట్లు వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు రాబట్టడంతోపాటు పెండింగ్ బకాయిలను వసూలుచేయడానికి రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని జోన్‌ల కమిషనర్లు, రెవెన్యూ అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. అసెస్‌మెంట్‌లను ఆస్తిపన్ను మాదిరిగా, ఖాళీస్థలాల అసెస్‌మెంట్‌లను వార్డు సచివాలయాల వారీగా మ్యాపింగ్ చేశారు. అడ్మిన్‌కార్యదర్శులు ప్రతి అసెస్‌మెంట్‌కు వెళ్లి పన్ను చెల్లించేలా యజమానులతో చర్చలు జరిపి, బకాయిలను రాబట్టారు. అంతకుముందు వార్డుల వారీగా అసెస్‌మెంట్‌లు ఉండడంతో టాక్స్ కలెక్టర్లు అన్ని అసెస్‌మెంట్‌ల యజమానులను కలిసి చర్చించేందుకు అవకాశం ఉండేది కాదు. తాజాగా వార్డు సచివాలయం పరిధిలో అన్ని అసెస్‌మెంట్‌లను మ్యాపింగ్ చేయడంతో పన్ను చెల్లించాల్సినవారికి డిమాండ్ నోటీసులు ఇవ్వడం, స్పందించనివారికి జప్తునోటీసులు ఇవ్వడం సులభమైంది. జీవీఎంసీ పరిధిలో సుమారు 20వేల మందికి జప్తునోటీసులు ఇవ్వడంతో వారంతా బకాయిలను క్లియర్ చేసుకోవడం పన్ను వసూలు పెరగడానికి దోహదపడింది.
కలెక్టర్ చొరవతో...
అలాగే జీవీఎంసీ కమిషనర్ పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉండడంతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం కూడా పన్నులు వసూలు పెరుగుదలకు పరోక్షంగా కారణమైందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ హోదాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పోర్టు, రైల్వేశాఖల ఉన్నతాధికారులతో నేరుగా ఆయన సమావేశమై ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని కోరడంతో వారంతా కొంత కట్టేందుకు ముందుకువచ్చారని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్టు ట్రస్టు ఇటీవల రూ.12 కోట్లు ఆస్తిపన్ను చెల్లించగా, రైల్వేశాఖ నుంచి కూడా సోమవారం రూ.ఆరు కోట్లు వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఏయూ వీసీతో కూడా జిల్లా కలెక్టరు హరేంధిరప్రసాద్ చర్చలు జరపడంతో రూ. ఏడు కోట్లు పన్ను చెల్లించారని చెబుతున్నారు. ఇది పన్నుల వసూళ్ల పెరుగుదలకు కారణమైందంటున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ ప్రకటించడంతో చాలామంది ప్రైవేటు అసెస్‌మెంట్ దారులు బకాయిలను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బకాయిలపై వడ్డీ మాఫీకి సోమవారం మాత్రమే గడువు ఉండడంతో మరింత మంది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక సంవత్సరం చివరిరోజు మరో రూ.15 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.