Share News

వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:33 PM

స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను మే 11, 12, 13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించి, జిల్లాకు మరింత ఖ్యాతిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, పక్కన ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు

అల్లూరి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలి

ఉత్సవాల సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

ఉత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు : ఎస్‌పీ అమిత్‌బర్దర్‌

పాడేరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):

స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను మే 11, 12, 13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించి, జిల్లాకు మరింత ఖ్యాతిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా సౌకర్యాలు, భోజన వసతి, ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు, పోలీస్‌ బందోబస్తు, అగ్నిమాపక శకటాలు ఏర్పాటు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రధానంగా తాగునీటి సమస్య ఏర్పడకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే పండుగ రోజుల్లో అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించి, నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌ విభాగం అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. అలాగే ఏర్పాట్లకు సంబంధించి కోర్‌ కమిటీలను నియమించి, ఆయా పనులు, ఏర్పాట్లను కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనులు చేయాలన్నారు. ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు.

ఉత్సవాలకు గట్టి బందోబస్తు: ఎస్‌పీ

మోదకొండమ్మ ఉత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు కల్పిస్తామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందల మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి అంశంపై నిఘా ఉంటుందని, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే సాంస్కృతి కార్యక్రమాలు రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతాయని, వాటిని తెల్లవారుజాము 4 గంటల వరకు నిర్వహించుకునేలా అధికారులు అనుమతులివ్వాలన్నారు. అలాగే పట్టణంలోని విద్యుత్‌ దీపాలంకరణ పనులను ప్రభుత్వం చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. 2014 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా టీడీపీ ప్రభుత్వం గుర్తించి, ఉత్సవాల నిర్వహణకు రూ.1 కోటి విడుదల చేస్తుందన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి రూ.1 కోటి విడుదలకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు స్థానికంగా వసతి సమకూర్చలేని పరిస్థితి ఉంటుందని, ఈక్రమంలో తెల్లవారుజాము వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్థానికులు వసతి కల్పించలేరని గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పీ కె.ధీరజ్‌, సబ్‌కలెక్టర్‌ శార్యమన్‌ పటేల్‌, డీఆర్‌వో పద్మలత, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్‌.రజని, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:33 PM