Share News

చింతపండుకు మరింత గిరాకీ

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:10 AM

చింతపండుకు మరింత గిరాకీ

చింతపండుకు మరింత గిరాకీ
కోనాం సంతకు చింతపండు తెచ్చిన గిరిజనులు

కోనాం సతంలో గత వారంతోపోలిస్తే కిలోకు రూ.10 పెరుగుదల

చీడికాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాం సంతలో గురువారం చింతపండు కొనుగోలుకు వ్యాపారులు అధిక సంఖ్యలో రావడంతో గిరాకీ పెరిగింది. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.10 వరకు ధర పెరిగింది. ఆరు వారాల నుంచి చింతపండు ధరలు క్రమేపీ పెరుగుతుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. నిల్ల పచ్చళ్లు తయారు చేసే సీజన్‌ కావడంతో చింతపండు వినియోగం అధికంగా ఉందని, దీంతో అధిక ధరకు కొనుగోలు చేయకతప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కోనాం సంతకు చీడికాడ, పాడేరు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో పలు గ్రామాల గిరిజనులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం చింతపండు సీజన్‌ కావడంతో ఎక్కువమంది కావిళ్లు, బుట్టలతో సంతకు తీసుకువస్తున్నారు. సుమారు 20 కిలోల బరువు గల కావిడి చింతపండు గత వారం రూ.1,500 నుంచి రూ.1,600లకు కొనుగోలు చేయగా, ఈ వారం రూ.1,600 నుంచి రూ.1,650 వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది చింతచెట్లకు కాపు తక్కువ వచ్చిందని, దీంతో చింతపండుకు గిరాకీ ఏర్పడి తమకు గిట్టుబాటు లభిస్తున్నదని గిరిజనులు సంతోషంతో చెబుతున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:10 AM